Reading Time: < 1 minute
Telangana 22a Land Issues Ponguleti Srinivas Reddy Orders

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల ఏ ఒక్క అర్హులైన పేదవాడికి, నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని, ప్రైవేట్ భూములను నిషేధించారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో 22ఏ భూములు, ప్రజావాణి ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలపై ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారి హక్కులను కాపాడుతూనే, ప్రభుత్వ భూములను కాపాడడమనే రెండు లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొంగులేటి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ భూములకు సంబంధించి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే దరఖాస్తులను, ఫిర్యాదులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. ప్రజావాణిలో వచ్చిన 22ఏ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే విచారణ పూర్తి చేసి పరిష్కరించాలి. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల స్థాయిలో ప్రతీ కేసును రికార్డులు, చట్టపరమైన ఆధారాల బట్టి పరిశీలించాలి. తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకే ఉంటుంది. ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను, ప్రభుత్వ ప్రయోజనాలను సమతుల్యం చేయాలని సూచించారు.