
Robin Uthappa Warning To Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ గొప్పగా ఆరంభం అయింది. ఇంగ్లండ్‌పై ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ.. జింబాబ్వేపై మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. మూడు టీ20ల్లో 50, 20, 81 పరుగులతో చెలరేగాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఓపెనింగ్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఇక ఆసియా గేమ్స్ 2026లో బరిలోకి దిగేందుకు బుడ్డోడు సిద్దమవుతున్నాడు. అయితే యువ సంచలనం సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాబిన్ ఊతప్ప సూచనలు:
ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. అనంతరం భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ ద్వారా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో భారత పురుషుల జట్టుకు ఆడిన ఆటగాడి రికార్డును అధిగమించాడు. జింబాబ్వే పర్యటనలో నాలుగో అంతర్జాతీయ మ్యాచ్‌కే అర్ధ శతకం సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలో చోటు దక్కించుకుని, అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్ర వేసిన వైభవ్ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు. అదే సమయంలో ఓ హెచ్చరిక కూడా జారీ చేశాడు. బుడ్డోడిని సరైన మార్గంలో నడిపించకపోతే.. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా తరహా అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
కాంబ్లీ, పృథ్వీ షా తరహా తప్పులు చేయొద్దు:
రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘వైభవ్ తెల్లబంతి క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న ఆటగాడు. అయితే అతడి కెరీర్‌ను ఎలా నిర్వహిస్తారన్నదే అత్యంత కీలకం. భారత క్రికెట్‌లో గతంలో కూడా ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు వచ్చారు. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి వారిపై 17-18 ఏళ్ల వయసులోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత వారు తమ కెరీర్‌లో పూర్తిగా వెనుకబడ్డారు. వైభవ్ విషయంలో అలాంటి పరిస్థితి రాకూడదు. వచ్చే ఐదేళ్ల పాటు అతడు పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి. బీసీసీఐ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రస్తుతం బుడ్డోడి మాటల్లో కనిపిస్తున్న అమాయకత్వం నాకు చాలా నచ్చింది’ అని ఊతప్ప తెలిపాడు.
సరైన మార్గనిర్దేశం చేయాలి:
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ప్రకటనలు, వాణిజ్య ఒప్పందాలకు దూరంగా ఉండి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం మంచి విషయమని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ’18 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే పేరు, ప్రచారం, వ్యక్తిగత ఆకర్షణలు యువ ఆటగాళ్ల దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు, కోచ్‌లు అతడికి సరైన మార్గనిర్దేశం చేయాలి. ఈ కుర్రాడు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ విషయంలో కూడా మనకు అలాంటి భావనే కలిగింది. సోషల్ మీడియాకు కూడా వైభవ్‌ను ప్రస్తుతం దూరంగా ఉంచాలి. అతడు క్రికెట్ ప్రపంచంలోనే పూర్తిగా లీనమై ఉండేలా అవకాశం ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చాడు. ఇక వైభవ్ తదుపరి ఆసియా క్రీడల్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో బుడ్డోడు మరోసారి తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నాడు.