
AP FDC : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రముఖ చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయి ప్రసాద్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) విశ్వనాథన్ , పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు.
సింగిల్ విండో విధానం.. వేగంగా అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా సినిమా షూటింగ్‌లకు ఎదురవుతున్న ప్రక్రియల ఆలస్యాన్ని నివారించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. సినిమా నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ‘ఫాస్ట్ ట్రాక్’ ప్రాతిపదికన, ‘సింగిల్ విండో’ పద్ధతి ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని నిర్ణయించారు. వివిధ శాఖల విధివిధానాలను సమన్వయం చేసుకుంటూ షూటింగ్‌ల నిర్వహణను సులభతరం చేసేందుకు అధికారులంతా సానుకూలంగా స్పందించారని ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ వెల్లడించారు.
త్వరలోనే నూతన విధానం అందుబాటులోకి..
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సినిమాల షూటింగ్‌లు విజయవంతంగా జరుగుతున్నాయని, ఈ ఫాస్ట్ ట్రాక్ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో చిత్రనిర్మాణం మరింత పుంజుకుంటుందని భరత్ భూషణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
హాజరైన కీలక అధికారులు
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజీత్, పీసీసీఎఫ్ చలపతి రావు, సీఎఫ్‌ఎఫ్ ఎన్.ఎన్. రావులతో పాటు శశి భూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, సంపత్ కుమార్, యువరాజ్, కన్నబాబు, ఆమ్రపాలి, ప్రవీణ్ ఆదిత్య, శుభం బన్సాల్, భరణి, పద్మావతి, వెంకటరమణ తదితర విభాగాధిపతులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాల్గొన్నారు.