
హైదరాబాద్, వెలుగు: రాయలసీమలో తాగునీటి ఎద్దడిని తీర్చడంతోపాటు ఆరుతడి పంటలకు నీళ్లిచ్చేలా శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను మొదలుపెట్టాలని కోరుతూ నంద్యాల జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు సమితి ఉపాధ్యక్షుడు ఏరువ రామచంద్రారెడ్డి, యర్రం శంకర్‌రెడ్డి నేతృత్వంలోని నాయకులు వినతిపత్రం అందజేశారు.
నిరుడు శ్రీశైలం రిజర్వాయర్‌కు 2,000 టీఎంసీలకుపైగా వరద వచ్చినా.. విద్యుదుత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల క్యారీ ఓవర్ నీటిని ఉంచలేకపోయారన్నారు. దానివల్లే ప్రస్తుతం సాగు, తాగునీటి సంక్షోభం ఎదురవుతున్నదన్నారు.
ఎగువన కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి వరద వస్తున్నదని, పోతిరెడ్డిపాడు ద్వారా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులతో లింక్ ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపాలన్నారు.