Reading Time: < 1 minute
వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ?

వైద్య రంగంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు పుట్టిన తర్వాతే పసిబిడ్డలకు క్లిష్టమైన సర్జరీలు చేయడం చూశాం. కానీ, అసలు తల్లి కడుపులో ఇంకా రూపుదిద్దుకుంటున్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం సాధ్యమేనా? అంటే.. అవుననే నిరూపించారు లండన్ వైద్యులు. యుకేకి చెందిన థియో అనే చిన్నారి గర్భాశయంలో ఉండగానే విజయవంతమైన కీహోల్ సర్జరీ పొంది, ఈ రకమైన వైద్యం పొందిన మొదటి యుకే శిశువుగా చరిత్రకెక్కాడు. అసలు సమస్య ఏమిటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

తల్లి గర్భంలో ఉండగా నిర్వహించిన స్కాన్ పరీక్షల్లో బిడ్డ స్పైనా బైఫిడా అనే తీవ్రమైన జన్మసిద్ధ లోపంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. స్పైనా బైఫిడా అంటే వెన్నుపాము, వెన్నుపూస సరైన రీతిలో మూసుకోకపోవడం వల్ల నరాలు బయటకు రావడం. దీనివల్ల బిడ్డ పుట్టిన తర్వాత నడవలేకపోవడం, మూత్రపిండాల సమస్యలు లేదా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది.

విప్లవాత్మక వోంబ్ సర్జరీ:

తల్లికి నిర్వహించిన స్కానింగ్‌లో ఈ తీవ్రమైన లోపాన్ని లండన్‌లోని నిపుణులైన ఫీటల్ సర్జన్ల బృందం గుర్తించింది. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఆపరేషన్ చేస్తారు. అప్పటికే నరాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యుల బృందం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది.

కీహోల్ పద్ధతి:

తల్లి పొత్తికడుపు ద్వారా గర్భాశయంలోకి చిన్నపాటి కెమెరా, సూక్ష్మ పరికరాలను పంపి ఈ శస్త్రచికిత్స చేశారు.

వెన్నుపాము సరిచేయడం:

గర్భంలో ఉన్న శిశువు వెన్నుపాము భాగంలో తెరుచుకుని ఉన్న చర్మాన్ని, కణజాలాన్ని విజయవంతంగా మూసివేశారు.

 

View this post on Instagram

 

A post shared by Authentic Voice (@authentic.voice)

పుట్టకముందే ఈ సర్జరీ చేయడం వల్ల అమాయక శిశువు వెన్నుపాముపై గర్భాశయంలోని ఉమ్మనీరు ప్రభావం పడకుండా కాపాడగలిగారు. ఆ తర్వాత థియో ఆరోగ్యంగా జన్మించాడు. ఇప్పుడు ఆ చిన్నారి సాధారణ పిల్లల తరహాలోనే కాళ్లు కదుపుతూ, ఆరోగ్యకరమైన ఎదుగుదలతో ఉన్నాడు. ఈ అరుదైన, సంచలనాత్మక శస్త్రచికిత్స భవిష్యత్తులో స్పైనా బైఫిడాతో పుట్టబోయే వేలాది మంది పిల్లల జీవితాల్లో కొత్త ఆశల వెలుగులు నింపుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..