
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వాడుతున్న వారిపై కొత్త సెస్ విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరపై అదనంగా సుమారు రూ.18 భారం పడే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ఘర్షణల సమయంలో ఎదురైన ఇంధన సరఫరా అంతరాయాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందట. అందుకే ఈ కొత్త భారం వేసేందుకు ప్లాన్ అని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం ఎల్పీజీపై కిలోకు రూ.1.29 చొప్పున సెస్ విధించవచ్చు. దీంతో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై దాదాపు రూ.18 అదనపు భారం పడుతుంది. అలాగే నేచురల్ గ్యాస్ పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 సెస్ విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ రెండు సెస్‌ల ద్వారా కేంద్రానికి ప్రతి ఏడాది సుమారు రూ.14వేల కోట్లు సమకూరే అవకాశం ఉందని వెల్లడైంది.
ఈ డబ్బుతో ఏం చేయనున్నారు?
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం వచ్చే పదేళ్లలో రూ.4లక్షల 30వేల కోట్ల వ్యయంతో భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ నిల్వల కోసం ప్రత్యేక స్టోరేజీ కేంద్రాలు నిర్మించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఇంధన నిల్వలను సిద్ధంగా ఉంచనున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్పీజీ, సహజ వాయువు నిల్వల మౌలిక వసతుల కోసం వినియోగదారుల నుంచి వసూలు చేసే సెస్‌ను వినియోగించే అవకాశం ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత ఇంధన భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్ తన అవసరాల్లో దాదాపు 90 శాతం చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ముందస్తు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది.
అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇంకా దీనికి ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. దేశవ్యాప్తంగా కోట్లాది గ్యాస్ వినియోగదారుల నెలవారీ వంటగ్యాస్ ఖర్చు సుమారు 2 శాతం వరకు పెరుగుతుంది.