Reading Time: 2 minutes
Hushar Pittalu Movie: స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు.. కారణం ఇదే..

అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన సినిమా హుషారు పిట్టలు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది. బిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భాను కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాను మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో పుట్ట భాను అనే పాత్రలో కనిపించనున్న ఆయన, తన నిజ జీవితంలోనూ ఇదే పేరుతో సినిమాల పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకున్నారని వివరించారు. తన ఊరి థియేటర్లలో ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షో చూసేవాడినని, తెరపై కామెడీ సీన్లు వస్తే సీట్లలో కూర్చుని నవ్వుతుండేవాడినని తెలిపారు. ఇప్పుడు హుషార్ పిట్టలు ప్రివ్యూలో తన క్యారెక్టర్ స్క్రీన్‌పై నడుస్తుంటే ప్రేక్షకులు నవ్వుతుండటం చూసి, అది నిజమా, కలా అని నమ్మలేకపోయానని భావోద్వేగంగా వెల్లడించారు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని, అది ఇంకా తనను వెంటాడుతోందని పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్లుగా సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నానని భాను తెలిపారు. ఎంతమంది వద్దన్నా, ఎన్ని నెగటివ్ మాటలు వచ్చినా సినిమానే తన జీవితమని, కచ్చితంగా నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని పాజిటివ్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి సమయంలో హుషార్ పిట్టలు సినిమా ద్వారా తనకు అద్భుతమైన అవకాశం లభించిందన్నారు. నిర్మాత కె. వెంకట్ యాదవ్, దర్శకుడు భిక్షు అన్న తనకు చిన్న క్యారెక్టర్ ఇవ్వకుండా, తనకంటూ ఒక గుర్తింపు వచ్చే మంచి పాత్రను ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని పేర్కొన్నారు. సినిమాల్లోకి రావడానికి 8 ఏళ్లు కష్టపడ్డానని.. ఇప్పుడు ఇది కల నిజమా అంటూ చెంప పై పదే పదే కొట్టుకున్నారు. దీంతో స్టేజ్ పై ఉన్నవాళ్లంతా షాకయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

సినీ అవకాశం రావడం కోసం తాను పడిన కష్టాలను, మొక్కులను కూడా భాను పంచుకున్నారు. ఛాన్స్ వచ్చే వరకు ప్రతి మంగళవారం చెప్పులు వేసుకోకూడదని మొక్కుకున్నానని, బోయినపల్లిలో ఉన్న ఎల్లమ్మ తల్లికి, కనిపించిన ప్రతి గుడికి మొక్కినట్లు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న తాను, ఇప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు తమను ఒక ఆర్టిస్ట్‌గా పరిచయం చేస్తున్న నిర్మాత, దర్శకుల కోసం వంద కొబ్బరికాయలకు అదనంగా కొడతానని, దేవునితో పాటు వాళ్లకూ కొబ్బరికాయలు కొడతానని చెప్పారు.

హుషార్ పిట్టలు సినిమా టీమ్ పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కు ఇది ఒక కల అని, నిర్మాత కె. వెంకట్ యాదవ్ ఆ కలను నెరవేర్చారని అన్నారు. ఆయనకూ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావాలనే కల ఉంటుందని, తెలుగు కుటుంబంగా ఆగస్టు 15న హుషార్ పిట్టలు సినిమాను చూసి, ప్రొడ్యూసర్‌కు మద్దతుగా నిలబడాలని భాను ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరారు. వాసవి గణేషన్, అన్ష్, గోవర్ధన్, సునీత మనోహర్ వంటి వారు ప్రధాన తారాగణంగా, భిక్షు దర్శకత్వంలో, చరణ్ అర్జున్ సంగీత సారథ్యంలో, కె. వెంకట్ యాదవ్ నిర్మాణంలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..



ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..