
- 32 నెలల్లో 75సార్లు రేవంత్ ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి ఒరిగిందేంటి?: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని, 13 రోజులకోసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, అయినా రాష్ట్రానికి ఒరిగిందేంటని ప్రశ్నించారు. ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తుచేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు.
‘‘జనం కేసీఆర్‌ను జాతిపిత అనుకుంటున్నట్టే.. ఆయనకు జయశంకర్ సార్ గాడ్‌ఫాదర్. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టడమే.. జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళి’’ అని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ దేహీ అని యాచిస్తున్నారని, ఢిల్లీ ముందు గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతున్నదని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సైన పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్..
తెలంగాణకు కాంగ్రెస్ శాశ్వత శత్రువని జయశంకర్ సార్ పదే పదే చెప్పేవారని కేటీఆర్ గుర్తుచేశారు. స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ సార్ విశ్లేషించారని, పాలమూరు వెనుకబాటుతనాన్ని కూడా అదే కోణంలో వివరించారన్నారు. 2006, 2008 ఉప ఎన్నికల సమయంలో ఉద్యమానికి భావజాల వ్యాప్తి, ఆందోళన, డెమోక్రటైజేషన్ అనే మూడు పార్శ్వాలు ఉన్నాయని ఆయన చెప్పారని గుర్తుచేశారు. ‘యాచించి కాదు.. శాసించి తెలంగాణ సాధించాలి’ అనే ఆలోచనను నూరిపోశారని పేర్కొన్నారు. ప్రస్తుతం నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నీళ్లున్నా ఈ సీఎం పంపులు ఆన్ చెయ్యడం లేదన్నారు. మన గురువు జయశంకర్ అయితే.. ఆయన గురువేమో పక్క రాష్ట్ర సీఎం అని విమర్శించారు.