Reading Time: 2 minutes
Sonam Wangchuk Midnight Deal Allegations Centre Government

Sonam Wangchuk: దేశంలో రాజకీయ నాయకులు, వారి మాటల వెనుక ఉన్న అసలు రంగు ఎలాంటిదో మరోసారి బయటపడింది! లడఖ్ ఉద్యమకారుడు, ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఏకంగా కేంద్ర ప్రభుత్వ నేతలే తనను దారుణంగా మోసం చేశారని చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. నీట్ (NEET) వ్యవహారంపై అభిజీత్ దిప్కే నేతృత్వంలోని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా, జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభించిన తన 26 రోజుల నిరాహార దీక్షను ఆయన ఇటీవల విరమించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దీక్ష విరమణ వెనుక కేంద్ర మంత్రులు ఆడిన అర్ధరాత్రి రాజకీయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, అన్ని రాజకీయ పక్షాలపై తనకున్న నమ్మకం పూర్తిగా పోయిందని వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనమ్ వాంగ్‌చుక్ ఈ విస్తుపోయే విషయాలను వెల్లడించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ అర్ధరాత్రి వేళ తన వద్దకు వచ్చి ఫొటోలు తీయించుకున్నారని, అయితే ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి ప్రతినిధులను కూడా కలగలిపి ఉమ్మడిగా ప్రకటన చేసేవరకు ఆ ఫొటోలను బయటకు విడుదల చేయకూడదని వారి మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరిందన్నారు. లడఖ్ సాంప్రదాయం ప్రకారం డిమాండ్లు నెరవేరినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు జ్యూస్ లేదా సూప్ ఇచ్చి దీక్ష విరమింపజేయడం ఆనవాయితీ అని, కానీ ఈ ఘట్టాన్ని కేవలం అధికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదనేది తన ఉద్దేశమని చెప్పారు. మంత్రులు అర్ధరాత్రి దాటాక రావడంతో, ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకుల ఫొటోలతో కలిపి ఉమ్మడి ప్రయత్నంగానే ఈ వార్తను బయటకు ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, అక్కడే ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సీనియర్ అధికారులను కూడా ఈ ఒప్పందానికి సాక్షులుగా పెట్టామని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.

తీరా చూస్తే, మాట ఇచ్చిన మరుక్షణమే ఆ హామీ గాల్లో కలిసిపోయింది! “ఒప్పందం కుదిరిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఓ ఐబీ అధికారి కంగారుగా పరుగెత్తుకొస్తూ… ‘సార్, ఈ ఫొటోలు అప్పుడే టీవీ ఛానళ్లలో స్క్రోల్ అవుతున్నాయి’ అని చెప్పారు” అంటూ ఆ క్షణంలో తనకు ఎదురైన మోసాన్ని వాంగ్‌చుక్ గుర్తుచేసుకున్నారు. రాజకీయ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడకుండా ఇలా ప్రవర్తించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన చెందారు. అదే సమయంలో ప్రభుత్వం వద్ద తాను ఏదో మిడ్‌నైట్ డీల్ కుదుర్చుకుని దీక్ష విరమించానంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “నాకు అలాంటి డీల్స్ కుదుర్చుకోవాలనే ఆశే ఉంటే, ఇన్ని రోజలు అల్లాడిపోతూ 26 రోజుల పాటు ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేయాల్సిన అవసరమే లేదు. గతంలోనే పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి, కాదనుకుంటే నన్ను విద్యాశాఖ మంత్రిని చేయమని కూడా అడిగేవాడిని. నాకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదు” అని స్పష్టం చేశారు.