
ముంబై: హోమియోపతి వైద్యుల రిజిస్ట్రేషన్ అంశాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగిన మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరాలని హైకోర్టు వారిని ఆదేశించింది. ఒకవేళ వారు విధుల్లో చేరకుండా సమ్మెను కొనసాగిస్తే డాక్టర్ల జీతాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హక్కుల కోసం పోరాడే చట్టపరమైన హక్కు ఎవరికైనా ఉంటుంది.. కానీ అది రోగుల ప్రాణాల మీదకు తీసుకురాకూడదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (MMC) పరిధిలో హోమియోపతి చదివిన వారు ఒక సంవత్సరం మోడరన్ ఫార్మకాలజీ సర్టిఫికేట్ కోర్సు (CCMP) పూర్తి చేస్తే వారిని అల్లోపతి ప్రాక్టీస్ కోసం రిజిస్ట్రేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ నిర్ణయంపై మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమకు తీరని అన్యాయం చేస్తోందని ఆగస్టు 5 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల మంది రెసిడెంట్ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హోమియోపతి వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది.
రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రెసిడెంట్ డాక్టర్ సమ్మె అంశాన్ని బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. బాంబే హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం గురువారం (ఆగస్ట్ 6) ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు. విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన రెసిడెంట్ డాక్టర్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరకుండా ఆందోళన కొనసాగిస్తే వారి వేతనం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని డాక్టర్లు హెచ్చరించడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల రోగులు మరణిస్తే.. ఆ చనిపోయిన ప్రాణాలను డాక్టర్లు తిరిగి తీసుకురాగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. హక్కుల కోసం పోరాడే చట్టపరమైన హక్కు ఎవరికైనా ఉండవచ్చు.. కానీ అది రోగుల ప్రాణాల మీదకు తీసుకురాకూడదని హితవు పలికింది. మరోవైపు.. వైద్యులు ఆందోళనలను వినాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెసిడెంట్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు.