
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి టార్గెట్‌గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాది రెక్కీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సీఎం సువేందు నివాస పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. గత వారం పూర్వ బర్ధమాన్ జిల్లాలో హమీమ్ మండల్‌ను ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. అతడితో పాటు అర్పితా సర్కార్, ఆదిత్య సిన్హాలను కూడా విచారిస్తోంది. మండల్ సీఎం సువేందు కదలికల్ని గమనించడం, ఆయన పాల్గొనే బహిరంగ కార్యక్రమాలకు హాజరవ్వడం, భద్రతలో బలహీనతలు గుర్తించడం వంటి పనుల్ని చేశాడు. పాకిస్తాన్‌లోని అతడి హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఈ పనుల చేసినట్లు అధికారులు తెలిపారు.
సీఎం నివాస ప్రాంతానికి వెళ్లలేదని హమీమ్ మండల్ చెప్పినప్పటికీ, మొబైల్ టవర్ లొకేషన్‌తో సహా సాంకేతిక ఆధారాలతో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హమీమ్ మండల్‌కు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో పాటు పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహ్‌జాద్ భట్టి నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు, అర్పితా సర్కార్‌ను ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుని ‘‘హనీ ట్రాప్’’ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎస్టీఎఫ్ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సువేందు భద్రతను మరింత పెంచారు.