
- మన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయించేందుకు ఏపీ కుట్రలు చేస్తున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గోదావరి బోర్డు మీటింగ్ కోసం ఏపీ ప్రతిపాదించిన అంశాలు చూస్తుంటే.. తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరికీ కడుపు మండి రక్తం మరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎజెండా వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ విషం చిమ్మిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోడికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోందన్నారు. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని పొరుగు రాష్ట్రం ఎజెండాలో పేర్కొందని విమర్శించారు. ఏపీ ప్రతిపాదించిన ఎజెండాపై అభ్యంతరాలు చెప్పాల్సిన తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అసలు ఇప్పటికే అనుమతులు వచ్చిన ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలన్న ఏపీ వాదనను ఎజెండాలో పెట్టడానికి గోదావరి బోర్డుకు ఎంత ధైర్యమని మండిపడ్డారు.
జీఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక బోర్డు మాత్రమేనని, అలాంటిది కేంద్ర ప్రభుత్వానికి ఆ బోర్డు ఎలా గైడెన్స్ ఇస్తుందని హరీశ్ రావు ప్రశ్నించారు. కేంద్రం పరిశీలించి అనుమతించిన వాటిని మళ్లీ రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్ఎంబీకి ఎక్కడిదని నిలదీశారు. సమ్మక్కసాగర్‌కు ఉరేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు లేవని ఏపీ వాదిస్తుండడం చాలా ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు కోస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇప్పటికైనా స్పందించాలని, లేదంటే తామే ఉద్యమించాల్సి వస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు.