Reading Time: 2 minutes

డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళను భయపెట్టి..అకౌంట్ నుంచి రూ.1.42 కోట్లు కొట్టేశారు

Caption of Image.

డిజిటల్ అరెస్ట్ .. ఒక్క ఫోన్ కాల్..  మీపై మనీలాండరింగ్ కేసు ఉంది.. వెంటనే డబ్బు బదిలీ చేయకపోతే అరెస్ట్ చేస్తాం అంటూ సైబర్ కేటుగాళ్లు అమాయకులను భయపెట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. పోలీసులు, కోర్టు అధికారుల పేర్లు చెప్పి నమ్మించడం, ఫేక్ ఐడీ కార్డులు చూపించడం, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టడం ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ఎవరికైనా ఇలాంటి మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ ఏకంగా రూ.1.43 కోట్లు కోల్పోయింది. 

ఏపీ లోని కృష్ణా జిల్లాలో  డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. మచిలీపట్నానికి చెందిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులమని చెప్పి  సైబర్ కేటుగాళ్లు భయపెట్టి రూ.1.43 కోట్లు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోసగాళ్లు మొదట ఫోన్ చేసి, ఆమె పేరుతో మనీలాండరింగ్ కేసు నమోదైందని చెప్పారు. ఢిల్లీ పోలీసు అధికారులు, దర్యాప్తు అధికారులమంటూ నకిలీ పేర్లతో మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తి పేరు కూడా ప్రస్తావిస్తూ అరెస్ట్ వారెంట్ జారీ అయిందని బెదిరించారు. తర్వాత ఆమె బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఫోరెన్సిక్ పరిశీలన కోసం తాత్కాలికంగా మరో ఖాతాకు పంపించాలని చెప్పారు. విచారణ పూర్తయ్యాక మొత్తం డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించారు.

వారి మాటలు నమ్మిన మహిళ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లను డ్రాచేసి, ఆర్టీజీఎస్ ద్వారా విడతల వారీగా రూ.1.43 కోట్లు మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. కొన్ని రోజుల తర్వాత మరో రూ.95 లక్షలు పంపాలని బెదిరించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పగా, అతని సూచన మేరకు పోలీసులను ఆశ్రయించారు.

ALSO READ : అప్పులు చేసినోళ్లకు గుడ్ న్యూస్

ఈ ఘటనపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  డిజిటల్ అరెస్ట్ అనే విధానం భారతదేశంలో అసలు లేదు అని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. పోలీసులు, సీబీఐ, ఈడీ లేదా కోర్టు అధికారులు ఫోన్ చేసి డబ్బు బదిలీ చేయమని ఎప్పుడూ చెప్పరని హెచ్చరించారు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే కాల్ కట్ చేసి, 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.