Reading Time: < 1 minute
Karnataka Class 10 Student Collapses Dies During Volleyball Match

కర్ణాటకలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా 10వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని సూరింజె సమీపంలోని సూరత్‌కల్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మృత విద్యార్థి లిఖిత్ అమీన్ (15)గా గుర్తించారు. సూరింజెలోని గవర్నమెంట్ హైస్కూల్, కోటె బొల్లారులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) చదువుతున్నాడు.

స్నేహితులతో కలిసి సూరింజె మైదానంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో లిఖిత్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ముందుగా బంతిని సర్వ్ చేసిన లిఖిత్, ప్రత్యర్థి జట్టు కొట్టిన బంతిని తిరిగి ఆడేందుకు నెట్ వైపు పరుగెత్తాడు. కొద్ది క్షణాలకే చేతులను పైకెత్తి ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడంతో అక్కడున్న తోటి విద్యార్థులు, ఇతరులు వెంటనే అతడి దగ్గరకు చేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే లిఖిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

విద్యార్థి మృతికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, విద్యార్థి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.