Reading Time: < 1 minute
Karikala First Look Sundeep Kishan Stuns As A Warrior In Pan India Fantasy Epic

Karikala First Look: సందీప్ కిషన్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు పూర్తిస్థాయి అడ్వెంచర్ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు ఆయన చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కరికాల’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సందీప్ కిషన్‌ ఫస్ట్ లుక్. ఓ శక్తివంతమైన యోధుడిగా చూపించిన ఈ విజువల్స్ ని చూస్తూ ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ సందీప్ ను చూడలేదని అభిమానులు సంబరపడుతున్నారు. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మిస్తున్నారు. ‘శంభల’ తర్వాత మరో భారీ ఫాంటసీ కథతో యుగంధర్ ముని ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. చందమామ కథలను గుర్తు చేసే మాయా ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సందీప్ కిషన్ చేతిలో కత్తి పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తారు. ఆయన పక్కనే గర్జిస్తున్న సింహం ఉండటం పోస్టర్‌కు మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాలో పురాణ గాథలు, రాజ్యాలు, మాయా జీవులు, అతీంద్రియ శక్తులు కూడా ఉండనున్నట్లు పోస్టర్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.

‘కరికాల’ పాత్ర సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక మేకోవర్‌తో సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ప్రేమకథలు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో అలరించిన సందీప్ ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన ఫాంటసీ యోధుడిగా మారడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫాంటసీ అడ్వెంచర్ ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మొదటి భాగం 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుండగా, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు. తక్కువ వ్యవధిలోనే రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషంగా మారింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక వివరాలతో పాటు మిగతా నటీనటుల వివరాలను గోప్యంగా ఉంచింది. త్వరలోనే పూర్తి తారాగణాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.