Reading Time: < 1 minute
Lok Sabha Passes Bill Enabling Charges On Upi And Other Digital Payments

UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున వసూలు చేయడానికి వీల్లేదు. కొత్త సవరణతో ప్రభుత్వం నోటిఫికేన్ ద్వారా ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఎంత ఛార్జీలు విధించవచ్చో నిర్ణయించే అధికారం పొందుతుంది.

ప్రస్తుతం RTGS, NEFT వంటి రియల్‌టైమ్ బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం, ఇప్పటికప్పుడే UPI లావాదేవీలపై ఛార్జీలు అమలులోకి రావు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే ఏ లావాదేవీకి ఎంత చెల్లించాలనే వివరాలు తెలుస్తాయి.

డిజిటల్ పేమెంట్స్ మౌలిక సదుపాయాలను నిర్వహించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరుల్ని సమకూర్చడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం, వ్యాపారులకు జరిగే అధిక విలువ గల UPI లావాదేవీలపై మాత్రమే MDR అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య జరిగే (Peer-to-Peer) UPI చెల్లింపులను మినహాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.