
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజంతా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కోస్తా , ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రత్యేక సూచనలు చేశారు. భారీ వర్షాల సమయంలో చెట్ల కింద తలదాచుకోరాదని హెచ్చరించారు. వేటకు వెళ్లే మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువన వస్తున్న వరదతో జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో రైతన్నలు పొలం పనులు వేగవంతం చేస్తున్నారు. మరో వైపు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు నమోదవగా, డ్యాం నీటిమట్టం పదహారు వందల పందొమ్మిది అడుగులకు చేరింది. మైత్తం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 59 టీఎంసీల నీటి నిల్వ నమోదవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం జలాశయం యాభై శాతానికి పైగా నిండింది. జూరాల నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, ప్రస్తుతం నీటిమట్టం ఎనిమిది వందల అరవై మూడు అడుగులకు చేరింది. జలాశయంలో నూట పద్దెనిమిది టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. వరద ప్రవాహంపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. తెలంగాణలో మరో రెండురోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని హెచ్చరించింది. బుధవారం రోజంతా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ సహా 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. జూరాల ప్రాజెక్టుకు రెండు లక్షల నలభై నాలుగు వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ముప్పై మూడు గేట్లు ఎత్తి రెండు లక్షల నలభై తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో పదకొండు యూనిట్ల ద్వారా నాలుగు వందల ముప్పై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 26 అడుగుల వద్ద కొనసాగుతోంది. దిగువ ప్రాంతాలకు 3 లక్షల 26వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణ నది ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర పుష్కర ఘాట్ నుంచి రోడ్డు బ్రిడ్జి వరకు ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ చూపరులకు కనువిందు చేస్తోంది. ఒకవైపు పచ్చని ప్రకృతి ఒలకబోస్తున్న అందాలు… మరోవైపు పరవళ్లు తొక్కుతూ ఉప్పొంగుతున్న జలధారను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ లక్షా 37వేల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రస్తుతం నీటిమట్టం ఏడు వందల అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఒక వేల ఏడు వందల క్యూసెక్కుల వరద వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం నూరు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ముప్పై వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 35 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీటిమట్టం వెయ్యి డెబ్బై ఆరు అడుగులకు చేరింది. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలోని ఇందూరు నయగర జలపాతంగా పేరుపొందిన శీలం జానకి బాయి చెరువు అలుగు పోస్తోంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సిర్నపల్లిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పొంగిపొర్లుతోంది. జలపాతాన్ని తలపించేలా నలభై అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుండటంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. చెరువు అలుగు పోయడం తెలుసుకున్న ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగానైనా రోడ్డును మరమ్మతులు చేసి సిర్నాపల్లి వాటర్ ఫాల్స్‌ను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం తొమ్మిది వందల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. అదే స్థాయిలో తొమ్మిది వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 137 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. మరో రెండు వారాలు ప్రాజెక్టుకు ఇదే తీరులో వరద కొనసాగితే నిండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, మహారాష్ట్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నీటిలో వాహనాలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వారణాసి, ప్రయాగ్‌రాజ్ ఘాట్లు నీట మునిగాయి. ఆగస్టు 7 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని IMD హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోనూ భారీ వర్షం కారణంగా మార్కెట్లు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లో భారీ వర్షాలకు ఊరంతా నీట మునిగింది. కొన్నిచోట్ల నీరు ఏకంగా 5 నుంచి 6 అడుగుల ఎత్తులో నిలిచి.. 150కి పైగా షాపులు, బ్యాంకులు దెబ్బతిన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ట్రాక్టర్లను వాడుతున్నారు. మున్సిపాలిటీ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. రుతుపవన ద్రోణితో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా సమృద్ధిగా తేమ లభించి వర్షాల తీవ్రత పెరుగుతోందని ఐఎండీ స్పష్టం చేసింది. మరోవైపు, వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వడగాలులు , పిడుగుపాట్లను ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చినట్లు కేంద్ర హోంశాఖ లోక్‌సభలో వెల్లడించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్టేట్ – నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిబంధనల్లో వీటిని చేర్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. దీనివల్ల వడగాలులు, పిడుగుపాట్ల బారిన పడిన బాధితులకు తక్షణ ఉపశమనం, సహాయక చర్యల కోసం రాష్ట్రాలు SDRF నిధులను నేరుగా వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్!
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే కళ్లు జిగేల్!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!