
- పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే..30% కమీషన్ దందా
- టెండర్లు, భూకేటాయింపులపై విచారణ చేయించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య అవినీతి బంధం కొనసాగుతోందని, రెండు పార్టీలు కలిసి తెలంగాణ సంపదను దోచుకుంటున్నాయని బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో చక్రం తిప్పిన అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు. టెండర్లు, కమీషన్లు, భూ కేటాయింపులు, విదేశీ పర్యటనలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన నరసింహారెడ్డికి మూసీ రివర్‌ఫ్రంట్ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
తొమ్మిదిన్నరేళ్లు హరీశ్‌రావు వద్ద పీఏగా పనిచేసిన అశోక్ రెడ్డికి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. డైరెక్ట్ ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ, కన్ఫర్డ్ ఐఏఎస్‌లకే కీలక పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్-, బీఆర్ఎస్ అవగాహనకు నిదర్శనమని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీలో చెత్త తీసేందుకు ఏకంగా రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తోందని ఆయన ప్రశ్నించారు. మొదట రూ.10వేల కోట్లతో రెండు ప్యాకేజీలు అని చెప్పి, ఇప్పుడు అదనంగా మరో రూ.11వేల కోట్ల టెండర్లకు సిద్ధం చేయడం ప్రజాధనాన్ని దోచుకోవడానికేనని విమర్శించారు.
సీఎంఆర్ అవినీతిపై బీఆర్ఎస్ మాట్లాడదు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చేపట్టిన రూ.92వేల కోట్ల పనుల్లో, దాదాపు రూ.82,500 కోట్ల పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి ఆస్థాన కాంట్రాక్టర్లుగా మారిన వీరు, పనుల విలువలో 30–-32 శాతం కమీషన్‌గా ఉంచుకుని, మిగిలిన పనులను తెలంగాణలోని చిన్న కాంట్రాక్టర్లకు సబ్‌కాంట్రాక్టులుగా ఇస్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్ల పేరుతో రూ.5వేల కోట్ల పనులను కూడా ఒకే ఆంధ్రా కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల సొమ్ముతో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ట్రాన్స్‌కో, సింగరేణి సీఎండీలకు అమెరికాలో ఏం పని అని ప్రశ్నించారు. సివిల్ సప్లైస్ శాఖలో 9వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని, డిఫాల్టర్ రైస్ మిల్లర్ల నుంచి ధాన్యాన్ని ఎందుకు రికవరీ చేయడం లేదన్నారు. ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. వారి మౌనమే కాంగ్రెస్-, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందానికి సాక్ష్యమని ఆయన అన్నారు.