
మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రహానే.. క్రికెట్ కు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. ధోనీ తర్వాత టీమిండియా అలా మారటానికి కారణం కోహ్లీ, రవిశాస్త్రిలేనని అన్నారు.
ధోనీ రిటైర్మెంట్ టీమిండియాను ఒక క్లిష్టమైన దశలో పడేసిందని అన్నారు. ఆ సందర్భంలో టీమ్ మైండ్ సెట్ ను మార్చడంలో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆటగాళ్లను డేరింగ్, డ్యాషింగ్ గా మార్చడంలో ఈ ఇద్దరు ఎంతో చేశారని అన్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కండిషన్స్ లో టీమ్ మైండ్ సెట్ ను సెట్ చేయడంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, కోహ్లీల పాత్ర మరువలేనిదని అన్నారు.
మైకేల్ వాన్, సర్ అలస్టిర్ కుక్, ఫిల్ టఫ్నెల్, డేవిడ్ బంబెల్ లలాయిడ్ కలిసి స్టిక్ టు క్రికెట్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రహానే ఈ వ్యాఖ్యలు చేశారు.
2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మధ్యలో ధోనీ రిటైర్ అయినప్పుడు, కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కోహ్లీ తన టీమ్ కు దూకుడుగా ఉండేలా తయారు చేశాడు. ఇది ఇండియాను ప్రపంచంలోనే బలమైన ట్రావెలింగ్ టీమ్ గా ఎదగడానికి సహాయపడింది. ఆ టైమ్ లో టీమ్ లో ఉన్న రహానే, టీమ్ మెంటాలిటీని మార్చినందుకు కోహ్లీకి, అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఈ క్రెడిట్ ఇచ్చాడు.
ఎంఎస్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నప్పుడు, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి భారత క్రికెట్‌ను, ముఖ్యంగా విదేశీ టెస్టుల్లో మరింత పటిష్టం చేశారు. రక్షణాత్మకంగా కాకుండా, మరింత అగ్రెసివ్ గా, ధైర్యంగా, ముందుచూపుతో ఆడేవాళ్ళుగా మారినట్లు రహానే అన్నారు.
మొదటి బంతి నుంచే దాడి చేయాలనిపిస్తే, అలాగే చెయ్యి అని విరాట్ నాకు ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన ఆటగాళ్లకు నిర్భయంగా ఆడేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు, అని చెప్పారు. కోహ్లీ, శాస్త్రిల సారథ్యంలో ఇండియా టెస్ట్ దశల్లో అత్యంత విజయవంతమైన దశను ఆస్వాదించింది. ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక సిరీస్‌లను గెలుచుకోవడం, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం, తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడం వంటివి వీళ్లిద్దరి కాంబోలోనే జరిగాయి.