
జనగామ, వెలుగు: మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గురువారం జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీసోమేశ్వరాలయన్ని దర్శించుకున్నారు.
అనంతరం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ‘మహిళలపై లైంగిక వేధింపులు’ అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వేధింపులు, దాడులకు గురైన బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంతో పాటు, చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, వైద్య సేవలు, పునరావాసం వంటి సేవలు అందించాలన్నారు. మహిళల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత సున్నితంగా, వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవాలన్నారు.
లింగ నిర్ధారణ టెస్ట్‌లు, అబార్షన్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్సందీప్కుమార్ఝా, డీడబ్ల్యూవో బెన్ షాలోమ్, మహిళా కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ, రాధాబాయి, సదా లక్ష్మీ, పద్మజ, అధికారులు పాల్గొన్నారు.