
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా నిలిచిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన జగన్, రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దిశ ఎందుకు తీసుకొచ్చామంటే…
మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా తమ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకొచ్చిందని జగన్ పేర్కొన్నారు. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగిన వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ కల్పించడం, వేగవంతమైన దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీట్ దాఖలు, ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించడం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించామని వివరించారు.
దిశలో అందుబాటులోకి వచ్చిన సేవలు
దిశ యాప్‌లో SOS బటన్ లేదా ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా నిమిషాల్లో పోలీసులు స్పందించే విధానాన్ని తీసుకొచ్చామని జగన్ తెలిపారు. 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, దాని ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పటి ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో 18 ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో 13,500 మంది మహిళా పోలీసులతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించినట్లు చెప్పారు.
ఫోరెన్సిక్, ప్రత్యేక కోర్టులతో వేగవంతమైన న్యాయం
ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశామని, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. అలాగే 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ రూపొందించినట్లు చెప్పారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గిందని పేర్కొన్నారు. 164 అత్యాచార కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేశామని, తీవ్రమైన కేసుల్లో 51 శాతానికి పైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అలాగే 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడగా, మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయని తెలిపారు.
BNSతో దిశకు ప్రత్యామ్నాయం కాదన్న జగన్
ప్రస్తుత ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (BNS) సరిపోతుందని, దిశ అవసరం లేదని భావిస్తోందని జగన్ విమర్శించారు. అయితే మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు, గ్రామస్థాయి మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు వంటి వ్యవస్థలకు BNS ప్రత్యామ్నాయం కాదన్నారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాల్లో ఏడు పని రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ అనంతరం 14 పని రోజుల్లో విచారణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో దిశ వ్యవస్థను రూపొందించామని గుర్తుచేశారు. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, దానిని ఉపసంహరించుకోవడం మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, నేరస్తుల్లో చట్టంపై భయాన్ని తగ్గిస్తుందని విమర్శించారు. చివరగా, దిశను రద్దు చేయడం కాదని, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
https://x.com/ysjagan/status/2085712046893785107