Reading Time: < 1 minute
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు, రజక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వృద్ధురాలి మృతదేహాన్ని సాయంత్రం కర్నూలు నుండి అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబసభ్యులు నేరుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉంచి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం వైపు వెళ్లకుండా మార్గమధ్యలోనే అంబులెన్స్ ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నించగా, పోలీసులు వారిని నిలువరించి మృతదేహాన్ని బలవంతంగా ఆమె నివాసానికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటింఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.