
Mohammad Kaif About Rohit Sharma Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొద్ది రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌పై మొదటి రెండు వన్డేల్లో తక్కువ పరుగులు చేసి విమర్శలు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో భారీ సెంచరీ (138)తో చెలరేగాడు. దాంతో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. లార్డ్స్ మైదానంలో తొలి వన్డే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన రోహిత్.. తన ఫామ్‌పై ఉన్న సందేహాలను కూడా తొలగించాడు.
సెలెక్టర్లకు రోహిత్ సందేశం:
మూడో వన్డే మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను జట్టులో కొనసాగించే విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పునరాలోచనలో ఉందని, 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కావొచ్చని కూడా కథనాలు వచ్చాయి. అయితే ఆ ప్రచారాలన్నింటికీ రోహిత్ తన బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ అంశంపై స్పందించిన మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్.. రోహిత్ తన ఆటతో బీసీసీఐ సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్ చెప్పదలచుకున్న విషయం ఒక్కటే. నేను బాగా ఆడకపోతే మీరు నిర్ణయం తీసుకోండి, నన్ను జట్టు నుంచి తప్పించండి. కానీ నేను స్వచ్ఛందంగా తప్పుకునే ఆలోచనలో లేను’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ స్పష్టమైన వైఖరి చెప్పాలి:
‘రోహిత్ శర్మ ఇప్పటివరకు రిటైర్మెంట్ ప్రకటించకపోవడం, ఆటపై అదే ఉత్సాహాన్ని కొనసాగించడం, దూకుడుగా బ్యాటింగ్ చేయడం, లార్డ్స్‌లో సెంచరీ సాధించడం చూస్తుంటే.. అతడు ఇంకా భారత జట్టుకు ఆడటంపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు ఉంది. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అది వారి ఇష్టం. అయితే ప్రస్తుతం జట్టులో ఏం జరుగుతుందో బయటివారికి పూర్తిగా అర్థం కావడం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా రోహిత్‌పై తమ వైఖరిని బహిరంగంగా స్పష్టం చేయాలి. రోహిత్‌కు సహజమైన ఆట ఆడే స్వేచ్ఛ ఇచ్చామని కోచింగ్ సిబ్బంది చెబుతున్నారు. కానీ 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్ కీలక భాగం అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. ఆ ప్రకటన చేస్తే రోహిత్‌పై ఉన్న సందేహాలు తొలగిపోతాయి’ అని కైఫ్ పేర్కొన్నాడు.
ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడం కల:
ఆటగాడి ఫామ్‌లో హెచ్చుతగ్గులు సహజమేనని, ఒకటి రెండు సిరీస్‌లు విఫలమైనంత మాత్రాన నమ్మకం కోల్పోవద్దని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారాలను బట్టి చూస్తే రోహిత్ శర్మ మాత్రం స్వయంగా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో లేడని, తుది నిర్ణయం సెలెక్టర్ల చేతుల్లోనే ఉంటుందని కైఫ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడం తన కల అని హిట్‌మ్యాన్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ తృటిలో మిస్ అయింది. వచ్చే ఏడాది 2027 వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఆ మెగా టోర్నీలో ఆడాలని రోహిత్ లక్ష్యం. అంతేకాదు టీమిండియాకు కప్పు అందించాలని చూస్తున్నాడు.