
2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇప్పటికే విశ్లేషణలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్‌మార్క్ టోర్నీ కోసం మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన జట్టును విశ్లేషిస్తూ, అది అత్యంత సమతుల్యమైన జట్టు అని ఆకాష్ చోప్రా కొనియాడారు. గవాస్కర్ ప్రతిపాదించిన జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో కూడిన బలమైన టాపార్డర్ ఉంది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఎంచుకోవడం సరైన వ్యూహమని చోప్రా పేర్కొన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు బ్యాటింగ్ చేయగల హర్షిత్ రాణా, ఎడమచేతి వాటం వేగపంథీ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. ఈ జట్టుకు చోప్రా 10కి 8.5 లేదా 9 రేటింగ్ ఇస్తూ, ఇది ప్రపంచకప్‌కు ఎంపికయ్యే తుది జట్టుకు చాలా దగ్గరగా ఉందని అన్నారు.
మరోవైపు.. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తనదైన శైలిలో ఆటగాళ్లను వర్గీకరించారు. దక్షిణాఫ్రికా పిచ్‌లకు భువనేశ్వర్ కుమార్ అనుభవం ఎంతో అవసరమని, ఆయనను విజయ్ హజారే వంటి దేశవాళీ టోర్నీలు ఆడించి ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. అశ్విన్ తన ‘యెస్’ (ఖచ్చితంగా ఉండే) జాబితాలో భువనేశ్వర్‌తో పాటు గిల్, రోహిత్, విరాట్, అయ్యర్, రాహుల్, కిషన్, హార్దిక్, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, హర్షిత్‌లను చేర్చారు. ఇక యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లను ‘మేబీ’ (సందేహాస్పద) విభాగంలో ఉంచారు. ఆశ్చర్యకరంగా రిషభ్ పంత్, సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ప్రముఖ ఆటగాళ్లను అశ్విన్ రేసులో లేరంటూ తన ‘నో’ కేటగిరీలో నిలిపారు.