Reading Time: < 1 minute
Mp Lingamaneni Ramesh Seeks Two New Aiims Hospitals For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌ (AIIMS) ఆస్పత్రులను మంజూరు చేయాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యాధునిక వైద్య సంస్థగా అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు ఎంపీ లింగమనేని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని దాదాపు ఐదు కోట్ల జనాభాకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క ఎయిమ్స్ సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ లింగమనేని లేఖలో వివరించారు. గతంలో జమ్మూ కశ్మీర్, బిహార్ వంటి రాష్ట్రాలకు ఒకటికి మించి ఎయిమ్స్‌లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కూ మరో రెండు ఎయిమ్స్‌లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలు తగ్గడంతో పాటు అధునాతన వైద్య సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.

అలాగే ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌ను అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయాలని లింగమనేని రమేశ్ సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్, న్యూరోసైన్సెస్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ కేర్ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలను విస్తరించాలని కోరారు. ఈ విభాగాలకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలతో పాటు మరిన్ని పడకలు, వైద్యులు, సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలంటే ఎయిమ్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఎంపీ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి.. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ఎయిమ్స్‌లను మంజూరు చేయాలని కోరారు.