Reading Time: < 1 minute

ప్రాణం తీసిన మైనర్‌‌ డ్రైవింగ్‌..షేక్‌పేటలో రోడ్డు దాటుతుండగా కారుతో ఢీకొట్టిన బాలుడు  

Caption of Image.
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • బాలుడితోపాటు తండ్రి పై     కేసు నమోదు
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 

గచ్చిబౌలి, వెలుగు: మూడు రోజుల కింద  యూసుఫ్ గూడ కార్మికనగర్‌‌ లో బాలుడి కారు డ్రైవ్​ చేసి ఒకరి ప్రాణం తీయగా అలాంటి ఘటనే షేక్​పేటలోనూ చోటుచేసుకున్నది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిని కారుతో ఢీకొట్టగా ఒకరు కన్నుమూశారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరు చావు బతుకులతో పోరాడుతున్నారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన సుదీప్త దాస్ (26), సౌమెన్ రాయ్ (27), అభిజిత్ రాయ్ (26) నగరానికి వలస వచ్చి రాయదుర్గం పోచమ్మబస్తీలో ఉంటూ ఫీనిక్స్ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 1న రాత్రి సుదీప్త దాస్, సౌమెన్ రాయ్, అభిజిత్ రాయ్ ఇయర్‌ఫోన్ల కోసం సమీపంలోని మొబైల్ షాపుకు వెళ్లారు. రాత్రి 11.50 గంటలకు షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద రేణుకా ఎల్లమ్మ టెంపుల్​సమీపంలో రోడ్డు దాటుతుండగా..మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు వీరిని ఢీకొట్టింది. నలుగురు తీవ్రంగా గాయపడగా దవాఖానకు తరలించారు.

సుదీప్త దాస్‌ మార్గమధ్యలో చనిపోయాడు. సౌమెన్ రాయ్ పరిస్థితి విషమంగా ఉండగా, అభిజిత్ రాయ్ కుడికాలు విరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి చూడగా, కారును 16 ఏండ్ల బాలుడు నడుపుతున్నట్టు గుర్తించారు. ఓవర్​స్పీడ్​తో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నట్లు తేల్చారు. మృతుడి రూమ్‌మేట్ సౌరవ్ సంత్ర ఫిర్యాదు మేరకు గోల్కొండ సమతా కాలనీ, సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన కారు యజమాని మహమ్మద్ ఇమాదుద్దీన్(48)తో పాటు అతడి కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ భూపతి తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.