Reading Time: < 1 minute

తండ్రి చచ్చిపోతే కర్మ కాండలకు 5వేలు పంపించి అంత్యక్రియలను వీడియో కాల్లో వీక్షించిన కూతుర్లు !

Caption of Image.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ చెప్పిన మాటలను మానవతావాదులు కొట్టిపారేస్తుంటారు. కానీ కొన్ని ఘటనలు చూసినప్పుడు ఈ మాటలు అక్షర సత్యాలనిపిస్తుంది. మనిషిని నడిపించేది డబ్బేనని, డబ్బును మించిది లేదని.. డబ్బు ముందు కన్న బంధాలు కూడా కాని బంధాలేనని ఈ ఘటన కళ్లకు కట్టింది. ఈ బిజీ లైఫ్లో మనిషి కన్న బంధాలకు కూడా నీళ్లొదిలేశాడని రుజువు చేసిన ఘటన ఇది. హర్యానాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.

తండ్రి ఒక వృద్ధాశ్రమంలో చనిపోతే.. చూసేందుకు ఆయన ముగ్గురు కన్న కూతుర్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు రాలేదు. పైగా.. తామేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు 5 వేల 100 రూపాయలను కర్మ కాండల కోసం చెల్లించి వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు వీక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కన్న వాళ్లను చివరి రోజుల్లో కొందరు ఎంత అమానుషంగా చూస్తున్నారో ఈ ఘటనతో మరోసారి తేలిపోయింది.

వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని మించిన నరకం మరొకటి ఉండదు. అలాంటి ఒంటరితనంతో ఎంత మంది మనోవేదన అనుభవిస్తు్న్నారో.. కన్న బిడ్డల కనీస పరామర్శ కోసం ఎన్ని ముసలి కళ్లు వృద్ధాశ్రమం గేటు వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయో ఈ ఘటన చెప్పకనే చెప్పింది. మానవ బంధాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

హర్యానాలోని సోనీపత్లో ఈ ఘటన జరిగింది. ముగ్గురు కూతుర్లను రెక్కలు ముక్కలు చేసుకుని చదివించి, ప్రయోజకులను చేసిన తండ్రికి కూతుర్లు ఇచ్చిన బహుమానం ఇది. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలని ఆయన నిట్టూర్చారు.

©️ VIL Media Pvt Ltd.