Reading Time: 2 minutes

తెల్లవారుజామున ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్.. 2వేల 600 మందిని పీకేసిన వీసా

Caption of Image.

ప్రపంచ ప్రముఖ పేమెంట్స్ దిగ్గజం వీసా చేపట్టిన గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ భారత ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 2వేల600 ఉద్యోగాలను లేఆఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగులలో దాదాపు 7 శాతంకు సమానం. ఈ ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపై కూడా పడింది. ముఖ్యంగా కంపెనీకి కీలకమైన టెక్నాలజీ హబ్‌లుగా ఉన్న బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో భయం నెలకొంది.

తెల్లవారుజామున లేఆఫ్ మెయిల్స్
భారత్‌లో పలువురు ఉద్యోగులకు జూలై 29న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య హెచ్‌ఆర్ నుంచి లేఆఫ్ మెయిల్స్ అందాయి. కొంతమంది ఉద్యోగులు ఆ రోజు లాగిన్ అయ్యే సమయానికి ముందే తమ ఉద్యోగాలు పోయిన విషయాన్ని తెలుసుకున్నారు. ఒక ఇండియన్ టీమ్‌లో మొత్తం 28 మంది ఉండగా.. అందులో 10 మందిని తొలగించినట్లు సమాచారం.

సీనియర్ ఉద్యోగులపై కూడా ప్రభావం
ఈ లేఆఫ్స్‌లో కొత్త ఉద్యోగులు మాత్రమే కాకుండా.. కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సెవరెన్స్ ప్యాకేజీలు, సుమారు 15 నుంచి 30 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

భారత్‌లో వీసా టెక్ బేస్ 
వీసాకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటి. దేశంలో కంపెనీకి 3వేల 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, కార్పొరేట్ ఆపరేషన్స్ విభాగాల్లో భారత ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. అందుకే భారత్‌లో జరిగిన ఉద్యోగ కోతలు టెక్ రంగంలో ప్రత్యేక చర్చకు దారితీశాయి.

వీసా ఈ పునర్వ్యవస్థీకరణకు ప్రధాన కారణాల్లో ఒకటిగా AI వినియోగాన్ని పెంచడం కనిపిస్తోంది. కంపెనీ సీఈఓ ర్యాన్ మెక్‌ఇన్నెర్నీ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సహాయం చేసే AI నుంచి ముందుకు వెళ్లి, మానవ పర్యవేక్షణతో పనులు నిర్వహించే ఏజెంటిక్ AI వైపు సంస్థ దృష్టి పెడుతోందని తెలిపారు. AI ఆధారిత ఆటోమేషన్ పెరగడంతో ఫైనాన్స్, పేమెంట్స్, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోంది. కోడింగ్, డేటా ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి విభాగాల్లో AI ప్రభావం పెరుగుతుండటంతో కంపెనీలు తమ టీమ్ నిర్మాణాలను పునఃపరిశీలిస్తున్నాయి.

పేమెంట్స్ రంగంలో మార్పులు
వీసా మాత్రమే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. మాస్టర్‌కార్డ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 శాతం ఉద్యోగాలను తగ్గించే లేఆఫ్ ప్లాన్ ను ప్రకటించింది. అలాగే బ్లాక్ సంస్థ కూడా వేలాది ఉద్యోగాల కోతను ప్రకటించింది. అమెజాన్, క్లౌడ్‌ఫ్లేర్, అట్లాసియన్ వంటి టెక్ కంపెనీలు కూడా AI పెట్టుబడులు, సంస్థాగత మార్పుల పేరుతో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి.

భారత టెక్ ఉద్యోగులకు కొత్త సవాల్
వీసా లేఆఫ్స్ భారత టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో AI ఆధారిత మార్పుల ప్రభావానికి మరో ఉదాహరణగా మారాయి. ఒకప్పుడు భారీగా ఉద్యోగాలను సృష్టించిన టెక్ రంగం ఇప్పుడు కొత్త నైపుణ్యాలను కోరుతోంది. AI టూల్స్, ఆటోమేషన్, డేటా టెక్నాలజీలపై పట్టున్న ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతుండగా.. ఇంకా కోడింగ్ చేస్తాం అంటూ పాత చింతకాయ పచ్చడి మాటలు చెబుతున్నోళ్లకు మనుగడ కష్టంగా మారిపోయింది.
 

©️ VIL Media Pvt Ltd.