
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై అప్పుడే నిరసన జ్వాలలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ సంస్థ ప్రతినిధులు చిత్ర నిర్మాతలకు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.
‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఇటీవల చిత్ర యూనిట్‌కు ఒక లేఖ రాశారు. అందులో హిందూ మత విశ్వాసాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు, విజువల్స్ తమను బాధించాయని, వాటిల్లో సరైన ఎమోషన్స్ పండలేదని ఆయన లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో జరిగిన వివాదాలు, పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదని హెచ్చరించారు. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే తమ సంఘానికి ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాలని అర్జున్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవేళ తమ అభ్యర్థనను పక్కనపెట్టి సినిమాను నేరుగా విడుదల చేస్తే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిర్మాతలు మరియు దర్శకుడిని హెచ్చరించారు. కాగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ద్విభాషా మహా కావ్యం మొదటి భాగం ‘రామాయణ: పార్ట్ 1’ 2026 దీపావళికి అలాగే రెండవ భాగం ‘రామాయణ: పార్ట్ 2’ 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి