
Jaydev Unadkat, Sussex County Championship: భారత జాతీయ జట్టులో అవకాశాలు మూసుకుపోవడంతో టీమిండియా స్టార్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ సీజన్‌కు సిద్ధమయ్యేందుకు, తన పాత ఫామ్‌ను తిరిగి పొందేందుకు మళ్లీ ఇంగ్లాండ్ విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో రాణించి మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాలని ఈ గుజరాత్ స్పీడ్‌స్టర్ పట్టుదలతో ఉన్నాడు.
సస్సెక్స్ తరఫున మళ్లీ సమరం.. ఉనద్కత్ పక్కా ప్లాన్..!
ఈ వారంలోనే ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్న ఉనాద్కత్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. సస్సెక్స్ ఫ్రాంచైజీతో అతనికి ఇది నాలుగో సీజన్ కావడం విశేషం. ఈ సీజన్ మిగిలిన చివరి ఆరు రెడ్ బాల్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి జట్టును విజేతగా నిలిపేందుకు తన వంతు పాత్ర పోషించనున్నాడు.
ప్రస్తుతం ది హండ్రెడ్, వన్డే కప్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు చిన్న విరామం లభించింది. తిరిగి ఆగస్టు 20న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వారివిక్‌షైర్‌తో జరగబోయే మ్యాచ్‌తో ఉనాద్కత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2026 కమిట్‌మెంట్ల వల్ల ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైనా, గత జూన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే 8 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
ఐపీఎల్ ఆశాజనకంగా లేదు.. కౌంటీల్లో మాత్రం కేక..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026లో బరిలోకి దిగిన ఉనాద్కత్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో సస్సెక్స్ జట్టుకు అతడు ప్రధాన అస్త్రంగా మారాడు.
సస్సెక్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన 13 కౌంటీ మ్యాచ్‌ల్లో ఏకంగా 57 వికెట్లు పడగొట్టి 17.75 సగటు నమోదు చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఇంగ్లాండ్ కౌంటీల్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం ద్వారా లయను అందుకోవచ్చని భావిస్తున్నట్లు ఉనాద్కత్ వ్యాఖ్యానించాడు.
టీమిండియాలో చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడాడంటే..?
సౌరాష్ట్రకు రంజీ ట్రోఫీ అందించిన ఈ సీనియర్ బౌలర్, టీమిండియా తరఫున ఆఖరిసారిగా 2023 ఆగస్టు నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కనిపించాడు. టెస్టుల్లో కూడా జూలై 2023లో విండీస్‌పైనే చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టులో పోటీ పెరిగిపోవడంతో అతనికి చోటు దక్కలేదు.
ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీల్లో ఉనాద్కత్ ఒక్కడే కాకుండా చాహల్ (నాటింగ్‌హామ్‌షైర్), రాహుల్ చాహర్ (సూర్రే) వంటి పలువురు భారత ఆటగాళ్లు కూడా ఆడుతుండటం గమనార్హం.
వయసు పైబడుతున్నా పట్టు వదలకుండా కౌంటీ క్రికెట్‌లో చెమటోడుస్తున్న ఉనాద్కత్ కష్టం మెచ్చుకోదగినది. ఇంగ్లాండ్ గడ్డపై రాణించి రాబోయే భారత దేశవాళీ సీజన్‌లో మళ్లీ వికెట్ల పండగ చేసుకుంటాడో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..