
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వీళ్లకు కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ నుంచి ఘన స్వాగతం లభించింది. డప్పు చప్పుళ్లు, దేశభక్తి గీతాలతో హోరెత్తించారు. పూలమాలలు వేసి అథ్లెట్లను అభినందించారు. పలువురు అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ సంబురాలు ముగియకముందే తాము వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించామని అథ్లెట్లు స్పష్టం చేశారు. ఆసియాలోనూ పతకాల పంట పండిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘పెద్ద వేదికపై జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతిని జీవితంలో మర్చిపోలేనని, ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలవడమే తన తదుపరి లక్ష్యమని బాక్సర్ ప్రియా గంగాస్ పేర్కొంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత కేవలం మూడు వారాలు మాత్రమే ప్రాక్టీస్ చేసినప్పటికీ, దేశం కోసం పతకం సాధించడం పట్ల జాస్మిన్ లాంబోరియా హర్షం వ్యక్తం చేసింది. ఆసియా క్రీడలతో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించే దిశగా అడుగులు వేస్తానని వెల్లడించింది. విమెన్స్ 70 కేజీల్లో డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అరుంధతి చౌదరి చెప్పింది.