Reading Time: 2 minutes
Air India Appoints Tewolde Gebremariam New Ceo Md

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా టెవోల్డే గెబ్రెమారియంను నియమించింది. ప్రస్తుతం సంస్థకు సీఈవోగా ఉన్న క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఆగస్టు 5న అధికారికంగా ప్రకటించింది. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి, ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొనసాగుతున్న సంస్థ పరివర్తన ప్రయాణంలో ఈ నాయకత్వ మార్పు కీలక మలుపుగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది.

A

కొత్త సీఈవో ఎంపిక కోసం ఎయిరిండియా బోర్డు సమగ్రంగా అన్వేషణ చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలోని అంతర్గత అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా పరిశీలించినట్లు వెల్లడించింది. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మూల్యాంకనం చేసిన అనంతరం టెవోల్డే గెబ్రెమారియంను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎయిరిండియా తదుపరి వృద్ధి దశకు అవసరమైన సమర్థ నాయకత్వం, విమానయాన కార్యకలాపాలపై లోతైన అనుభవం, వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే సామర్థ్యం గెబ్రెమారియంకు ఉన్నాయని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.

ఎయిరిండియాలో చేరకముందు టెవోల్డే గెబ్రెమారియం పదేళ్లకు పైగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు. ఆయన నాయకత్వంలో సంస్థ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ను ఆఫ్రికాలోనే అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన విమానయాన గ్రూప్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన పదవీకాలంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఆదాయం నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు ఎయిరిండియా తెలిపింది. అదే సమయంలో సంస్థ విమానాల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. విమానయాన రంగంలో అత్యంత విజయవంతమైన సీఈవోలలో టెవోల్డే గెబ్రెమారియం ఒకరని ఎయిరిండియా అభివర్ణించింది. ఎయిరిండియా ప్రస్తుతం చేపడుతున్న విస్తరణ, ఆధునికీకరణ కార్యక్రమాల నేపథ్యంలో గెబ్రెమారియం నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నాయకత్వంలో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలమైన విమానయాన బ్రాండ్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.