
- రాజ్యసభలో ‘సుప్రీంకోర్టు సవరణ బిల్లు -2026’పై చర్చ
- పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు, నిరంజన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ ఎంపీ పి.నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో ‘సుప్రీంకోర్టు సవరణ బిల్లు–2026’పై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాదికి కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్‌లో బెంచ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం మరింత చేరువ అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ బెంచ్‌లు అవసరమన్నారు.
1956లో సుప్రీంకోర్టులో 11 మంది న్యాయమూర్తులు ఉండగా ఏటా 2,362 కేసులు నమోదయ్యేవని, ప్రస్తుతం 34 మంది జడ్జీలు ఉన్నప్పటికీ ఏటా కేసుల సంఖ్య 75 వేలు దాటిందని పేర్కొన్నారు. ఒక్కో న్యాయమూర్తిపై సగటున 2,218 కేసుల భారం ఉందన్నారు.హైకోర్టు తీర్పులపై ప్రతి అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితిని తగ్గించాలని సూచించారు. సివిల్, క్రిమినల్ కేసుల కోసం సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులతో ప్రత్యేక అప్పిలేట్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. బెయిల్, క్వాష్ పిటిషన్లపై సింగిల్ బెంచ్ తీర్పులపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ అవకాశం కల్పిస్తే సుప్రీంకోర్టు భారం 15 శాతం వరకు తగ్గుతుందని వివరించారు.