Reading Time: < 1 minute

ATMలో డబ్బు డ్రా చేస్తే క్యాష్ రాకుండానే అకౌంట్లో కట్ అయ్యాయ్.. న్యాయం చేసిన కోర్టు

Caption of Image.

కేరళలోని కోజికోడ్‌కు చెందిన పి.కె. సతియన్‌కు ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా కోసం చేసిన ట్రాన్సాక్షన్ కారణంగా జరిగిన అన్యాయంపై జిల్లా కన్జూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ బయటకు రాకపోయినా ఖాతా నుంచి రూ.10 వేలును డెబిట్ చేసినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సేవల్లో లోపం చేసినట్లు కమిషన్ తేల్చింది. డెబిట్ అయిన రూ.10 వేలును తిరిగి చెల్లించడంతో పాటు మానసిక వేదన, అసౌకర్యానికి పరిహారంగా మరో రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

2022 జూలై 28న సతియన్ కోజికోడ్‌లోని కల్లాయి రోడ్ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అయినప్పటికీ ఏటీఎం క్యాష్ డిస్పెన్స్ చేయలేదు. వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేసిన ఆయన జూలై 30న చెరూట్టి రోడ్ శాఖకు, ఆగస్టు 12న కల్లాయి రోడ్ శాఖకు లిఖితపూర్వకంగా కంప్లెయింట్ సమర్పించారు. అయినప్పటికీ బ్యాంకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

బ్యాంకు మాత్రం నగదు విజయవంతంగా డ్రా అయిందని, ఏటీఎం ఎలక్ట్రానిక్ జర్నల్ రికార్డులను ఆధారంగా చూపించింది. అయితే నగదు నిజంగా వినియోగదారుడికి అందిందని నిరూపించే సీసీటీవీ ఫుటేజీని సమర్పించలేకపోయింది. 

ఈ అంశాన్ని పరిశీలించిన కమిషన్.. కేవలం EJ రికార్డు సరిపోదని, సీసీటీవీ ఫుటేజీయే కీలక ఆధారమని స్పష్టం చేసింది. ఫిర్యాదులను సరిగా పరిష్కరించకుండా డబ్బు తిరిగి చెల్లించకపోవడం సేవల్లో లోపమే కాకుండా అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా కూడా పేర్కొంది. 30 రోజుల్లో రూ.10 వేలు రీఫండ్ చేసి, రూ.5 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే రీఫండ్ మొత్తంపై వార్షిక 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.

 

©️ VIL Media Pvt Ltd.