Reading Time: < 1 minute

రైతులకు చంద్రబాబు పాలన హానికరం: దేవరపల్లి పర్యటనలో జగన్

Caption of Image.

గోపాలపురం: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో జగన్ పర్యటించారు. పొగాకు యార్డులో రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేజీ పొగాకు ధర 289 రూపాయలు ఉండేదని.. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో 236 రూపాయలు మాత్రమే పలుకుతుందని చెప్పారు.

వేలం కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం పొగాకును రిజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం దళారులతో రాజీ పడిందని, దళారులు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేస్తామని రైతులకు జగన్ హామీ ఇచ్చారు.

కేజీ పొగాకుపై 70 రూపాయల దాకా నష్టపోతున్నామని రైతులు జగన్తో తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకం నామరూపాల్లేకుండా చేశారని, రైతు భరోసాలో కోతలు పెట్టారని జగన్ దుయ్యబట్టారు. రైతులకు చంద్రబాబు పాలన హానికరం అని జగన్ విమర్శించారు.

ఈ 27 ఏళ్ల చంద్ర బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, ఏపీలో రైతులు రోడ్డు మీదకొచ్చేసిన దయనీయ పరిస్థితులు ఉన్నాయని కూటమి పాలనపై జగన్ నిప్పులు చెరిగారు. బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదని కూటమి ప్రభుత్వ తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పర్యటనకు వైసీపీ కేడర్ భారీగా తరలివచ్చింది.

©️ VIL Media Pvt Ltd.