
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ధోనీ ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి అని, జట్టులోని ప్రతి ఆటగాడితో స్నేహపూర్వకంగా ఉండేవాడని చెప్పాడు. అయితే ధోనీ గదికి సంబంధించిన ఓ ప్రత్యేక నియమం ఉండేదని వెల్లడించాడు. తలుపు తెరిచి ఉంటే ఎవరైనా వెళ్లొచ్చని, కానీ తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసేవారు కాదని జింక్స్ వెల్లడించాడు.
అజింక్య రహానే గత వారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే అతడు అరంగేట్రం చేశాడు. అలాగే 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. తాజాగా ఓ క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రహానే.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ‘ధోనీ చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అందరిలాగే సాధారణ వ్యక్తి. అతని గది దాదాపు ఎప్పుడూ తెరిచే ఉండేది. జట్టులోని ఎవరైనా వెళ్లి మాట్లాడొచ్చు, సమయం గడపొచ్చు. చాలాసార్లు 10 నుంచి 15 మంది ఆటగాళ్లు, కొన్నిసార్లు మొత్తం జట్టే అతని గదిలో ఉండేది. కానీ ఒకసారి తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లేవారు కాదు. మహీని మేము అలా గౌరవించే వాళ్లం’ అని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా వినియోగంపై కూడా అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘సిరీస్ జరుగుతున్న సమయంలో నేను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటా. మ్యాచ్‌ల సమయంలో సోషల్ మీడియా యాప్‌లన్నింటినీ మొబైల్ నుంచి తొలగిస్తా. ఇది ఎవరూ చెప్పిన సలహా కాదు, నేనే స్వయంగా అలవాటు చేసుకున్నా. ఈ అలవాటుకు ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఇచ్చిన సలహా కూడా కారణం. 2017లో ఐపీఎల్‌లో కలిసి ఆడుతున్న సమయంలో సోషల్ మీడియాను పట్టించుకోవద్దని స్టోక్స్ సూచించాడు. అప్పటి నుంచి నాకు ఒక ప్రత్యేక దినచర్య ఏర్పడింది. ఖాళీ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడడం, పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, మరుసటి రోజు కోసం దుస్తులు సిద్ధం చేసుకోవడం వంటి పనులు నన్ను మానసికంగా ప్రశాంతంగా ఉంచాయి’ అని చెప్పాడు.
దాదాపు రెండు దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన అజింక్య రహానే.. భారత జట్టు తరఫున 85 టెస్టులు ఆడి 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 90 వన్డేల్లో 2,962 పరుగులు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 375 పరుగులు చేసి భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు.