Reading Time: < 1 minute
Punjab Transfers Amritsar Police Commissioner After Jantar Mantar Terror Plot Remarks

Punjab: జంతర్ మంతర్ నిరసనలపై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లార్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు భుల్లాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బదిలీ చేసింది. దీనిపై బీజేపీ ప్రశ్నల్ని లేవనెత్తింది. కొద్దిరోజుల క్రితం అమృత్‌సర్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద మాడ్యుళ్లపై కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో నలుగురు మైనర్లతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు పిస్టళ్లు, తొమ్మిది లైవ్ కార్ట్రిడ్జ్‌లు, నాలుగు పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భద్రతా కేంద్రాలపై నిఘా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లార్ మాట్లాడుతూ.. అరెస్టైన నిందితులు ఢిల్లిలోని జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించారని, నీట్ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో నిరసనకారులపై పెట్రోల్ బాంబులతో దాడి చేసే కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా సంచలనంగా మారాయి.

ఇప్పుడు, ఈ వ్యాఖ్యలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థమయ్యేలా ఎంపిక చేసిన భాగాలను మాత్రమే ప్రచారం చేశారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అరెస్టైన వ్యక్తులు జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నారని లేదా నిరసనకారులకు ఉగ్రవాద మాడ్యుళ్లతో సంబంధం ఉందని కమిషనర్ ఎక్కడా చెప్పలేదని స్పష్టతనిచ్చింది.

ఈ వివాదం తర్వాత భుల్లార్‌ను బదిలీ చేయడంపై రాజకీయ చర్చ మొదలైంది. ఈ బదిలీకి జంతర్ మంతర్ వ్యాఖ్యలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఈ బదిలీపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనను బదిలీ చేసిన సమయంపై అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. జంతర్ మంతర్ కుట్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్‌కు అసౌకర్యంగా మారాయా? అని ప్రశ్నించారు.