
- శాసనసభ ఉండగా కోర్టుకు ఎందుకొచ్చారంటూ ప్రశ్న
- ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాయల్ శంకర్ల పిటిషన్లపై హైకోర్టు ప్ర
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం జారీ చేసిన కార్యానిర్వాహక ఉత్తర్వుల (జీవో) అమలుకు కోర్టులు ఎలా ఆదేశాలు జారీ చేస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సమస్యల పరిష్కారానికి శాసనసభ వంటి వేదికలను ఎంచుకోకుండా కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీ పథకాల అమలు సరిగా జరగడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేశారు. అయితే, వీటిని పిల్స్‌గా స్వీకరించడానికి హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలపై ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.రామచంద్రరావు తదితరులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం పథకాలను ప్రకటించినా అమలు చేయడం లేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి ప్రభుత్వం సాయం ప్రకటించినా ఇంతవరకు అందించ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది రైతు కుటుంబాలకు ఇన్‌పుట్ సబ్సిడీకి అర్హులైనప్పటికీ, 10 వేల మందికి మాత్రమే చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర విదర్భలో పత్తి రైతుల ఆత్మహత్యల వంటి సంఘటనలను కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. జీవోలు కూడా చట్టాల్లాంటివేనని, వాటిని అమలు చేయాలని కార్యనిర్వాహక వ్యవస్థకు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో చర్చించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ధర్మాసం స్పందిస్తూ.. జీవోలను అమలు చేయాలని తామెలా చెప్పగలమని ప్రశ్నించింది. నిధుల విడుదల అన్నది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రాధాన్యాల వారీగా చేస్తుందని వ్యాఖ్యానించింది. అంతేగానీ ఈ పనికి రూ.2 వేల కోట్లు జారీ చేయండి అని తాము చెబితే అన్ని శాఖలకు సంబంధించి నిధుల విడుదలపై ఇలాంటి పిటిషన్లు కోర్టుకు చేరే అవకాశం ఉందని చెప్పింది. ప్రశ్నించలేని బలహీన వర్గాలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయాలన్నదే తమ లక్ష్యమని, ప్రస్తుతం బలవంతులే వీటిని దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలపై ఈ నెల 14న నిర్ణయం వెలువరిస్తామంటూ విచారణను కోర్టు వాయిదా వేసింది.