Reading Time: < 1 minute

విమానాల్లోనూ ఇథనాల్ E20 వాడతారా : కేంద్ర మంత్రి ఏమని చెప్పారంటే..?

Caption of Image.

విమాన ఇంధనం(ATF)లో ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమాన ఇంధనంలో ఇథనాల్ కలపనున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని క్లారిటీ ఇస్తూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి.. ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ రెండూ పూర్తిగా వేర్వేరు ఇంధనాలని తెలిపారు. ఈ రెండింటిని ఒకటిగా భావించడం సరైంది కాదని చెప్పారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ గుర్తించిన ప్రమాణాల ప్రకారం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారవుతుందని, అది కఠినమైన భద్రతా పరీక్షలు పూర్తైన తర్వాతే విమానాల్లో వినియోగిస్తారని చెప్పారు.

కేజ్రీవాల్ మాత్రం విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపితే విమానం గాల్లోనే ఇంజిన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు విమాన ప్రయాణం చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ అంశంపై రాజకీయంగా చర్చ ప్రారంభమైంది. మంత్రి రామ్ మోహన్ నాయుడు మాత్రం ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల విమాన ప్రయాణికుల్లో అనవసర భయాందోళనలు ఏర్పడతాయని అన్నారు. విమాన భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినమైన సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తోందని.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.

ALSO READ : స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం

2001 నాటి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మార్కెటింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని సవరణలు చేసింది. దీంతో భవిష్యత్తులో సింథటిక్ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం విమాన ఇంధనంలో ఇథనాల్‌ను తప్పనిసరిగా కలపాలనే నిర్ణయం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. సో విమానాల్లో వాడే ఇంధనంలో ఇథనాల్ మిక్స్ చేస్తారనే వార్తలు నిజం కాదని తేలిపోయింది. 

©️ VIL Media Pvt Ltd.