Reading Time: < 1 minute
Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అత్యంత చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి పది గ్రాముల బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుర్ఖాలు ధరించిన ముగ్గురు మహిళలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి నగల దుకాణంలోకి ప్రవేశించారు. వారు నగలు కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లలా వ్యవహరిస్తూ సిబ్బందిని వివిధ నగలు చూపించాలని కోరారు. ఒకవైపు మాట్లాడిస్తూ వారి దృష్టిని మరల్చిన సమయంలో, మరో వ్యక్తి ఎంతో చాకచక్యంగా కౌంటర్‌పై ఉన్న పది గ్రాముల బంగారు గొలుసును తీసుకుని దాచుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.

చోరీ జరిగిన వెంటనే ఏమీ తెలియనట్లుగా అందరూ దుకాణం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం నగల లెక్కల్లో తేడా గుర్తించిన దుకాణ యజమాని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను విశ్లేషిస్తున్న పోలీసులు, వారి గుర్తింపునకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

బంగారం చోరీ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..