
న్యూఢిల్లీ: 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత స్టార్ బ్యాటర్స్ యశస్వీ జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ 2027 వన్డే ప్రపంచ కప్ టీమిండియా జట్టు ప్రణాళికల్లో లేరని బిగ్ బాంబ్ పేల్చాడు. వరల్డ్ కప్‌కు వారిద్దరిని ఎంపిక చేయడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హార్దిక్ పాండ్య, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్ రౌండర్ల వైపు సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని.. తద్వారా ప్రధాన బ్యాటర్లకు జట్టులో స్థానం దక్కడం కష్టమని పేర్కొన్నారు. వికెట్ కీపర్ కోటాలోనూ మొదటి ప్రయారిటీ కేఎల్ రాహుల్‌కు దక్కుతుందని.. బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్ లేదా రిషబ్ పంత్ ఎంపికయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కీపర్ కోటాలోనూ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు కష్టమేనని పేర్కొన్నారు.
2027 వన్డే వరల్డ్ కప్:
2027 వన్డే ప్రపంచ కప్ ఐసీసీ నిర్వహించబోయే 14వ ఎడిషన్. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ మెగా టోర్నీ మళ్లీ ఆఫ్రికా ఖండంలో జరగనుంది. 2027, అక్టోబర్ నుంచి నవంబర్ 21 వరకు ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రియులను అలరించనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మూడు దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి అతిథ్యమిస్తున్నాయి.
కాగా, 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా 6వ సారి వన్డే ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని టీమిండియా భావిస్తోంది.