Reading Time: 2 minutes

టీమిండియా హిస్టారిక్ మూమెంట్.. ఇంగ్లాండ్, ఆసీస్ తర్వాత 600 టెస్టుల క్లబ్‌లోకి భారత్!

Caption of Image.

Team India 600th Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది. లంకతో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ ద్వారా భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే సాధించిన ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతోంది.

600వ టెస్టు మ్యాచ్‌తో చరిత్ర సృష్టించనున్న భారత్: 
గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి మ్యాచ్ భారత్‌కు సరిగ్గా 600వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే 600 కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో నిలవగా.. ప్రస్తుతం అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన జట్ల జాబితాలో ఇంగ్లాండ్ 1,097 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 882 మ్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. 1932లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు ఆడిన భారత జట్టు, ఇప్పటి వరకు 599 మ్యాచ్‌లని పూర్తి చేసుకుని ఈ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మూడో దేశంగా చరిత్ర సృష్టించనుంది.

టెస్టుల్లో భారత్ ట్రాక్ రికార్డు: 
భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన 599 టెస్టు మ్యాచ్‌ల్లో 186 విజయాలు సాధించగా.. టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా 426 విజయాలతో తొలి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 405 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. భారత జట్టు కంటే ముందు దక్షిణాఫ్రికా 191 విజయాలతో, వెస్టిండీస్ 187 విజయాలతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాబోయే సిరీస్‌లో గెలిచి విజయాల సంఖ్యను మరింత పెంచుకోవాలని ఇండియా చూస్తుంది. 

►ALSO READ | SRHకి ఫుల్‌టైమ్ కెప్టెన్ ఇషానే?.. కమిన్స్ నిర్ణయంతో లైన్ క్లియర్! 

శ్రీలంకపై భారత్ తిరుగులేని ఆధిపత్యం: 
శ్రీలంకతో ఇప్పటి వరకు ఆడిన టెస్టుల్లో భారత జట్టుదే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు 46 టెస్టు మ్యాచ్‌ల్లో తలపడగా, అందులో భారత్ 22 మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. శ్రీలంక కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగా, మిగిలిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. సొంతగడ్డపై శ్రీలంకతో ఆడిన 22 టెస్టుల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా 13 విజయాలతో చెలరేగగా, శ్రీలంక గడ్డపై ఆడిన 24 టెస్టుల్లో 9 మ్యాచ్‌ల్లో విక్టరీ సాధించింది. చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడినప్పుడు భారత్ 3–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు తమ 600వ మైలురాయి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.