Reading Time: < 1 minute
Hyderabad Liquor Shops Closed August 9 Bonalu Cyberabad

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకల సందర్భంగా భాగ్యనగరంలో మద్యం షాపుల మూసివేతపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. పండుగ రోజుల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది.

దీనిలో భాగంగా 2026, ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజున నిర్ణీత పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈ వైన్ షాపుల మూసివేత ఉత్తర్వులను ఆమోదించినట్లు తెలిపారు.

నిషేధం అమలులో ఉండే ప్రాంతాలు..
ఆగస్టు 9న ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో మద్యం షాపులు మూసి ఉంటాయి. అవి.. కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల,
మేడ్చల్, చందానగర్.

ఈ ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయబడతాయి. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్లకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు.

పండుగ వేళ ప్రజాశాంతి, సురక్షిత వాతావరణం కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే సదరు యాజమాన్యాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. బోనాల వేడుకల వేళ ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.