
కూకట్‌పల్లి. హైదరాబాద్ సిటీలోని ఒక కీలక ప్రాంతం. కమర్షియల్ హబ్, రెసిడెన్షియల్ ఏరియా కలగలిసిన ప్రాంతం. హైదరాబాద్ సిటీకి వాయువ్యంలో ఉన్న ఒక సబర్బన్ ఏరియా. అసలు ఈ ఏరియాకు కూకట్‌పల్లి అనే పేరు ఎలా వచ్చిందనే విషయంలో రకరకాల ప్రచారాలున్నాయి. అయితే.. ఈ కారణంగా ఈ ఏరియాను కూకట్ పల్లి అని పిలుస్తారనే కచ్చితమైన సమాచారం అయితే లేదు. గతంలో కూకట్ల అనే భూస్వామి ఈ ప్రాంతంలో నివసించినందు వల్ల ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని ఒక వాదన ఉంది.
కూకట్ల అనే ఒక సంపన్న భూస్వామికి ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఉండేవని.. ఆయన పేరు మీదుగా కూకట్ల పల్లి అని ఈ ప్రాంతాన్ని పిలిచేవారని.. కాలక్రమేణా అది కాస్తా కూకట్ పల్లిగా మారిందనే ప్రచారం కూడా ఉంది. కూకట్‌పల్లి అనే పేరు తెలుగు పదం అయిన “కూకట్ల” నుంచి వచ్చిందని మరో ప్రచారం కూడా ఉంది.
కూకట్ల అంటే.. చెక్క, కర్ర అనే అర్థం కూడా వస్తుంది. ఒకప్పుడు ఈ ఏరియాలో దట్టమైన గుట్టలు, అడవులు ఉండేవని.. ఇక్కడ ఉండే చెట్లను నరికి కర్రలు తయారు చేసేవారని.. పల్లి అంటే గ్రామం అనే అర్థం వస్తుందని.. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాన్ని కూకట్ల పల్లి అని పిలిచారని చెబుతారు. అది రానూ రానూ కూకట్‌పల్లిగా ప్రాచుర్యంలోకి వచ్చిందని కొందరి వాదన. కూకట్‌పల్లికి ఆ పేరు ఎలా వచ్చినప్పటికీ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, హోటల్స్, వాణిజ్య సముదాయాలతో ఈ ప్రాంతం ఎప్పుడూ జన సంచారంతో బిజీబిజీగా ఉంటుంది.
కూకట్ పల్లిలో లగ్జరీ అపార్ట్ మెంట్లు, విల్లాలతో పాటు మధ్య తరగతికి అందుబాటులో 1BHK, 2 BHK, 3BHK అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. దీంతో.. కమర్షియల్ గానే కాకుండా రెసిడెన్షియల్ ఏరియాగా కూడా కూకట్ పల్లి విరాజిల్లుతుంది. మెట్రో రైలు మార్గం ఈ ఏరియాకు మరింత కలిసొచ్చే అంశం. సీమాంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన సెటిలర్లు ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నారు. కూకట్ పల్లి ఒక కీలక నియోజకవర్గంగా కూడా ఉంది. మేడ్చల్-మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా స్థిరపడ్డారు.