Reading Time: 2 minutes
Ajinkya Rahane: కోచింగ్, కామెంట్రీ అనుకున్నారు.. కానీ ఊహించని నిర్ణయం తీసుకున్న రహానే

Ajinkya Rahane: భారత మాజీ స్టార్ క్రికెటర్ అజింక్య రహానే తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన కోచింగ్ లేదా కామెంట్రీ బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారు. అయితే మైదానంలో ఆటకు ఇంకా స్వస్తి చెప్పకూడదని నిశ్చయించుకున్న రహానే, యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ఆడటానికి సిద్ధమయ్యాడు.

అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌లో మార్కీ ప్లేయర్‎గా రహానే

యూరోపియన్ టీ20 లీగ్‌లోని అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ ఫ్రాంచైజీ అజింక్య రహానేను తమ జట్టులో మార్కీ ప్లేయర్‌(ప్రజాదరణ కలిగిన ప్లేయర్)గా చేర్చుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ జట్టులో స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, మైకేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), డేవిడ్ పేన్ (ఇంగ్లాండ్), రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లాండ్) వంటి ప్రపంచ స్థాయి స్టార్ ప్లేయర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రహానే రాకతో లీగ్‌కు అంతర్జాతీయంగా భారీ ఆదరణ దక్కుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ లీగ్‌లో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు ఆడుతున్నాడు.

అమ్‌స్టర్‌డామ్ కో-ఫౌండర్ స్టీవ్ వా ప్రశంసల వర్షం

అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ కో-ఫౌండర్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా రహానేను జట్టులోకి సాధరంగా ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌లో ఉండాల్సిన నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, వినయం, ఓర్పు అన్నీ రహానేలో నిండుగా ఉన్నాయి. తన ఆటతీరుతోనే కాకుండా మైదానంలో నడుచుకునే ప్రవర్తనతో ప్రపంచ క్రికెట్‌లో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఒత్తిడిలో అతడు చూపించే శాంతం, లీడర్‌షిప్ జట్టును విజయపథంలో నడిపించగలవు” అని ప్రశంసించారు.

అజింక్య రహానే ఘనమైన క్రికెట్ కెరీర్ గణాంకాలు

38 ఏళ్ల అజింక్య రహానే భారత జట్టు తరఫున సుదీర్ఘ కాలం సేవలందించాడు. ఆయన తన కెరీర్‌లో ఇంటర్నేషనల్ స్థాయిలో:

టెస్టులు: 85 మ్యాచ్‌లలో 5,077 పరుగులు (12 సెంచరీలు)

వన్డేలు: 90 మ్యాచ్‌లలో 2,962 పరుగులు (3 సెంచరీలు)

టీ20 ఇంటర్నేషనల్స్: 20 మ్యాచ్‌లలో 375 పరుగులు చేశాడు.

ఇక ఐపీఎల్‎లో 6 వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన రహానే, గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 212 మ్యాచ్‌లలో 197 ఇన్నింగ్స్‌లలో 5,367 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..