Reading Time: < 1 minute
రెండేళ్లుగా అమ్మానాన్నను చూడలేదు.. స్టార్టప్ కోసం జీవితాన్నే పణంగా పెట్టి యువ టెకీ.. ఏమోషనల్ వీడియో!

అమెరికాలో నివసిస్తున్న భారతీయ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ఉత్కర్ష్ నందా పంచుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్టార్టప్‌ల విజయాల వెనుక కనిపించని ఒత్తిడి, ఒంటరితనం, మానసిక భారం ఎలా ఉంటుందో ఆయన తన జీవితానుభవంతో వివరించడంతో ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది.

‘‘ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి మాత్రమే నా ఆత్మను కాపాడగలదు’’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసిన ఉత్కర్ష్, గత రెండేళ్లుగా కంపెనీ నిర్మాణంలో పూర్తిగా మునిగిపోయానని తెలిపారు. చిన్న గదిలో గంటల తరబడి పనిచేస్తూ, కుటుంబానికి కూడా సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. రెండేళ్లుగా భారతదేశానికి వెళ్లి తన తల్లిదండ్రులను కూడా కలవలేదని ఆయన వెల్లడించారు.

వీడియోలో తన పని చేసే గదిని చూపించిన ఉత్కర్ష్, టేబుల్‌పై పేరుకుపోయిన ఖాళీ డైట్ కోక్ బాటిళ్లను ప్రదర్శించారు. నిరంతర ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల గత కొన్ని నెలల్లోనే 20 కిలోలకు పైగా బరువు పెరిగానని చెప్పారు. స్టార్టప్‌ను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులు, నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. “ఇది నా జీవిత కథలా ఉంది”, “విజయం కోసం చెల్లించాల్సిన అసలు ధర ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం వ్యాపార విజయంతో పాటు ఆరోగ్యానికి, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఒక నెటిజన్ “మీరు అసలు ఏం నిర్మిస్తున్నారు?” అని ప్రశ్నించగా, ఉత్కర్ష్ తాను trymindhub.com అనే AI ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ప్రశ్నలకు మెరుగైన పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ వేదికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే AI ఆధారిత కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉత్కర్ష్ వీడియో మరోసారి స్టార్టప్ ప్రపంచంలో విజయం కోసం చేసే త్యాగాలు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి అంశాలపై చర్చకు దారితీసింది. విజయాల వెనుక కనిపించని వ్యక్తిగత పోరాటాలను ఈ వీడియో ప్రపంచానికి గుర్తు చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..