Reading Time: 2 minutes

కొంపదీసి ట్రైన్లో టీ తాగుతున్నారా..? వాటర్ హీటర్తో టీ వేడి చేస్తున్నారు బ్రో..!

Caption of Image.

ట్రైన్లో ఫుడ్ కాదు టీ, కాఫీలు తాగేందుకు కూడా కొందరు ప్రయాణికులు వెనుకడుగు వేస్తుంటారు. రైల్వే ఫుడ్ అండ్ బేవరేజెస్పై కొందరు ప్రయాణికులకు అంత నమ్మకం మరి. ఈ నమ్మకాన్ని IRCTC ఏమాత్రం వమ్ము చేయడం లేదు. వరస్ట్ ఫుడ్, వరస్ట్ టీ, కాఫీలు అందించే విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక రైల్వే ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియో చూసి నెటిజన్లు విస్తుపోయారు. మరీ ఇంత దారుణమైన టీ, కాఫీలు, ఫుడ్ రైళ్లలో అందిస్తున్నారనే విషయాన్ని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది.

మనం ఇళ్లలో నీళ్లు కాచుకునేందుకు వినియోగించుకునే ఇమ్మర్షన్ వాటర్ హీటర్.. అదేనండీ ఇమ్మర్షన్ రాడ్తో  క్యాటరింగ్ ఉద్యోగి టీ వేడి చేస్తున్నాడు. రైళ్లలో టీ పోసేందుకు తీసుకొచ్చే క్యాన్లోనే నేరుగా హీటర్ వేసేస్తున్నాడు. ఈ దృశ్యాలు రైళ్లలో టీ తాగే వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. వామ్మో.. ఇన్నాళ్లూ రైళ్లలో వస్తూపోతూ తాగిన టీని ఇలా వాటర్ హీటర్తో కాచారని తెలిసి కంగుతిన్నారు. అయితే.. అందరు IRCTC ఉద్యోగులు, అన్ని రైళ్లలో ఇలానే జరుగుతుండకపోవచ్చు గానీ రైల్వేలో ప్రయాణికులకు ఎంత దారుణంగా ఫుడ్, టీ, కాఫీలను తయారుచేస్తున్నారో ఈ ఘటన కళ్లకు కట్టింది.

ఇండియన్ రైల్వే.. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్. 2023 డేటా ప్రకారం.. 14 లక్షలకు పైగా ఉద్యోగులు రైల్వేల్లో పనిచేస్తున్నారు. ఇంత మంది ఉద్యోగులు పనిచేస్తున్న భారతీయ రైల్వే వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యం, తప్పులు దొర్లుతుంటాయి. కానీ.. ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో మాత్రం ఎప్పుడూ భారతీయ రైల్వే విమర్శల పాలవుతుంది. దర్శకుడు శంకర్ ‘అపరిచితుడు’ సినిమాలో.. రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే ఫుడ్ విషయంలో ఎద్దేవా చేస్తూ.. లోపాలను కడిగి పారేస్తూ ఒక సన్నివేశం తెరకెక్కించాడు. రైల్వేలో ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) లాభాల బాటలో పయనిస్తుంది. కానీ.. ప్రయాణికులకు అందించే సేవల విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శల పాలవుతూనే ఉంది.  ఆన్ లైన్ టికెట్లు, రైళ్లలో ఆహారం సరఫరా IRCTC బాధ్యత. IRCTC ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడటం మాత్రం రైల్వే శాఖ బాధ్యత అని చెప్పక తప్పదు. అందుకే.. వైరల్ అవుతున్న ఈ వీడియోపై స్పందించాలని IRCTCతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను, రైల్వే మంత్రిని కూడా నెటిజన్లు ‘ఎక్స్’లో ట్యాగ్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.