
కమర్షియల్ ట్రక్కు డ్రైవర్ల లైసెన్స్ లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 28 వేలకుపైగా వలస డ్రైవర్ల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు (CDL) రద్దు చేశారు. వీరిలో సుమారు 24 వేల మంది డ్రైవర్లను ఇంగ్లీషు భాష స్కిల్స్ టెస్ట్ పాస్ కానీ వారు ఉన్నారు. మరోవైపు రూల్స్ పాటించకుండా కమర్షియల్ లైసెన్సులు పొందేందుకు సహకరిస్తున్న 9వేల500 డ్రైవింగ్ స్కూళ్లపై కూడా చర్యలు చేపట్టారు. ట్రంప్ నిర్ణయంతో ఎక్కువగా భారతీయ ట్రక్కు డ్రైవర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్ , హర్యానా నుంచి అమెరికా లో అత్యధికంగా ట్రక్కు డ్రైవర్లు ఉన్నారు.
2025లో ఫ్లోరిడా ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత కమర్షియల్ డ్రైవర్లపై తనిఖీలు మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం.అప్పటి నుంచి ఇంగ్లీషు భాష రాని 26 వేలకుపైగా కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లను విధుల నుంచి తొలగించింది.
►ALSO READ | దుబాయ్ గజగజలాడింది : 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. ఇరాన్ దాడి చేసిందా లేక..!
మరోవైపు ట్రక్కింగ్ రంగంలో డ్రైవర్ల కొరతను తీర్చేందుకు “ఫ్రీడమ్ హాలర్స్” పేరుతో కొత్త కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా భారీ సైనిక వాహనాలు నడిపిన అనుభవం ఉన్న మాజీ సైనికులకు కమర్షియల్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్‌లో మినహాయింపు కల్పించి, త్వరగా CDL పొందే అవకాశం ఇవ్వనుంది.
రోడ్డు భద్రతను పెంచడం, వాణిజ్య డ్రైవింగ్ ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం, మాజీ సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా ప్రభుత్వం తెలిపింది.