మనకు పచ్చడి టేస్ట్‌గా రావాలంటే.. మంచి ఎర్రటి గోంగూర ఆకును ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర ఎక్కువ పులుపును కలిగి ఉండి, పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఎర్రగోంగూరనే తీసుకోండి. తర్వాత గోంగూర ఆకులను ఉప్పునీటిలో వేసి బాగా కడిగి, శుభ్రమైన కాటన్ క్లాత్ పైన ఆరబెట్టండి. ఇలా చేయడం ద్వారా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనెను కడాయిలో వేసి వేడి చేయాలి. 1/3 టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 100 గ్రాముల ఎండుమిరపకాయలను వేసి మధ్యస్థ మంటపై దోరగా వేయించాలి. అయితే మసాలాలు మాడిపోకుండా జాగ్రత్తపడాలి, లేకపోతే పచ్చడి చేదుగా మారవచ్చు. వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి, ఆరబెట్టిన గోంగూర ఆకును వేయాలి. మధ్యస్థ మంటపై గోంగూరను నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. ఆకు బాగా మెత్తబడిన తర్వాత మ్యాషర్ లేదా పప్పుగుత్తితో మెదుపుతూ ఉడికించాలి. ఇలా వేయించేటప్పుడే గోంగూరను మెదుపుకోవడం వల్ల పచ్చడి మెత్తగా తయారవుతుంది. చివరిగా, ఒక టేబుల్ స్పూన్ నూనెను కలిపి మరో రెండు, మూడు నిమిషాలు వేయించాలి. ఇలా చేయడం వల్ల గోంగూర జిగురు తగ్గి, పచ్చడి మరింత రుచిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
మరో కడాయిలో 200 గ్రాముల పల్లీ నూనె లేదా నువ్వుల నూనెను తీసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి 50 శాతం వేయించాలి. తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఈ పోపులో ముందుగా వేయించిన గోంగూర ముద్దను కలిపి రెండు, మూడు నిమిషాలు వేయించి స్టవ్ ఆపివేయాలి.
పోపు పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లోకి వేయించిన ధనియాలు, ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల కల్లుప్పు, 12-15 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని చల్లారిన గోంగూర-పోపు మిశ్రమంలో కలిపి, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసి, అవసరమైతే కలుపుకోవచ్చు. అంతే ఆంద్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయినట్టే.
తయారైన పచ్చడిని శుభ్రమైన, గాలి చొరబడని బాటిల్లో నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకు తాజాగా ఉంటుంది. పచ్చడి రంగు మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. ఈ పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసిన గోంగూర పచ్చడిని మీరు కూడా ప్రయత్నించి, దాని అద్భుతమైన రుచిని ఆస్వాదించండి.





