
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారంపై హైడ్రా లోతుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ నకిలీ ఎన్‌వోసీలు సృష్టించిన వారు ఎవరు? వాటి వెనుక ఉన్న పాత్రదారులు ఎవరనే అంశాలపై శాఖాపరంగా విచారణ జరుగుతోందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు చెందిన హైందవీ జూనియర్ కాలేజీ ఫేక్ ఫైర్ ఎన్‌వోసీపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. విచారణలో కొన్ని కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలతో ఇంటర్ బోర్డు అనుమతుల కోసం అప్లై చేసినట్లు గుర్తించింది.
దీంతో క్యూర్ పరిధిలోని అన్ని కాలేజీల ఫైర్ ఎన్‌వోసీలను చెక్ చేస్తోంది. ఫేక్ ఎన్‌వోసీలతో అనుమతులు పొందిన 52 మందిపై లేక్ పోలీస్ స్టేషన్‌లో హైడ్రా కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డులో ఓ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆయన హైడ్రాతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు ఉన్నాయో గుర్తించే పనిలో ఉన్నారు.